నిజామాబాద్ ప్రతినిధి, మార్చి5 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డికి ఎవరూ సాటిలేరని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. పరీక్షల సమయం మాత్రమే రేవంత్ రెడ్డి మార్చాడు.. కానీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గర్లోనే ఉందిని హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులకు బీజేపీ అడ్డుపడిందా ? రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి వా..? ఓల్డ్ సిటికి ముఖ్యమంత్రివా అని అర్బన్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను చిన్నచూపు చూస్తూ, ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. రంజాన్ సందర్భంగా పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూల్ మారుస్తావా.. మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలను ఇబ్బంది పెట్టేలా టైంటేబుల్ మార్చడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.