• పోలవరం త్వరలోనే పూర్తి
  • అమరావతి శరవేగంగా సాగుతోంది
  • విశాఖలో సారథ్యయాత్ర ముగింపు సభ
  • మోడీ స్ఫూర్తితో సారథ్య యాత్ర జరిపాం
  • ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్


(విశాఖపట్నం బ్యూరో, ఆంధ్రప్రభ) : విశాఖ ఉక్కు పరిశ్రమ లో ఏదో జరిగిపోతోందని అపోహలు సృష్టిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని బయటకు చెప్పడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా తమ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లపై శనివారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ… విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) పై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రైవేటీకరణను ఒక భూతంలా చూపించే ప్రయత్నం జరుగుతోందని, ప్రైవేటీకరణ అనేది అన్ని దేశాల్లోనూ జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని బీజేపీ పార్టీ మొదట కోరిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పురోభివృద్ధి చెందుతుందన్నారు.

విశాఖలో సారథ్య యాత్ర బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మాధవ్ ప్రకటించారు. విశాఖలోని రైల్వే మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రతి బీజేపీ కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించగా, ఈ సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ప్రతి కార్యకర్త పనిచేయాలని సారథ్యం యాత్ర నిర్వహించామన్నారు. సారథ్యం యాత్రలో వైతాళికులను గుర్తించి వారిని స్మరించుకున్నామన్నారు. ఈ సారథ్యం యాత్ర లో చాయ్ పే చర్చ (chai pe charcha) కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్నారు. అక్టోబర్ 2 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలను నిర్వహిస్తామన్నారు. నెక్స్ట్ జనరేషన్ (Next Generation) జీ ఎస్ టి సాహసోపేతమైన నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అనేక రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని వివరించారు. సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ విశాఖలో పర్యటిస్తారని, అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతమైందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్ డి ఏ సారధ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడిందని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వ్యవహరించారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీల నిధులను దారిమళ్లించిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మట్ట ప్రసాద్, నాగోతు రమేష్ నాయుడు పాల్గొన్నారు.

Leave a Reply