సీసీఐ ఆంక్షల పై పత్తి రైతు ఆగ్రహం
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : పత్తి కొనుగోళ్ల ముహూర్తం రోజే మద్దతు ధర, తేమ శాతం ఆంక్షలపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. కాటన్ కార్పొరేషన్ అధికారులు (Cotton Corporation Officers) తేమ శాతం నిబంధనలు విధించడం పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. కిసాన్ కపాస్ యాప్ ద్వారా ఈ రోజు నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ప్రకటించడంతో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పత్తి తీసుకువచ్చారు.

కాంటాల వద్ద తేమశాతం పరిగణలోకి తీసుకొని కొనుగోలు జరుపుతామని, 8 నుండి 12 శాతం పత్తిలో తేమ మించితే కొనుగోలు జరిపేది లేదని సీసీఐ అధికారులు (CCI officials) ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో రైతులు కాంటాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తిలో తేమ 20 నుండి 25% పెరగడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయి మార్కెటింగ్, సిసిఐ అధికారులను నిలదీశారు. తొలిరోజు 500 మంది రైతులు తీసుకువచ్చిన పత్తిని తూకం వేసి తేమ శాతం నిబంధన లేకుండా 20 శాతంలోపు తేమ ఉంటే కొనుగోళ్లు జరపాలని డిమాండ చేశారు. సీసీఐ, సీఎండీతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అధికారులు మాత్రం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటిస్తామని స్పష్టం చేశారు. అనంతరం రైతులు, ఎమ్మెల్యే కలిసి జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లారు.
సోయా కొనుగోళ్లపై రోడ్డెక్కిన రైతులు..!
సోయా పంట (Soya crop) చేతికి వచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్, నాఫెడ్ ఇప్పటివరకు కొనుగోలు చేపకట్టకపోవడంపై ఈ రోజు రైతులు సోయా పంటను ఆరబోసి నిరసన తెలిపారు. బేల జాతీయ రహదారిపైనే తడిసిన సోయాలను ఆరబెట్టి వినూత్న నిరసన చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పత్తి, సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

సోయాబీన్ పంటను కొనుగోలు చేసేంతవరకు ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అదిలాబాద్ జిల్లా (Adilabad District) సోనాలో సోయా రైతులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను ఎక్కడికి అక్కడ నిలిపివేశారు. అక్కడే వంట వార్పుచేసి నిరసన తెలిపారు. భైంసాలో సోయా రైతులు నిరసన తెలిపారు. వాతావరణ పరిస్థితులతో పంట ధాన్యం తడిసిపోతుందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టాలని తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, రైతు నాయకులు ముత్తన్న, జనార్దన్, అభిలాష్, సంగిపు బోర్రన్న, బేల తేజరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

