ఇక వలసలు ఉండవు..

  • ప‌లాస విమానాశ్రయం కాదు
  • ఇది ఉద్ధానం ఎయిర్ పోర్టు
  • ఏ రైతుకూ నష్టం రాదు
  • ల్యాండ్ పూలింగ్ లో ఇబ్బంది లేదు
  • సిక్కోలు అభివృద్ధికి.. ఎయిర్ పోర్టు రావాల్సిందే
  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం జిల్లా), : సిక్కోలు జిల్లా అంటే.. వలసల జిల్లా కాదు. ఇది పలాస విమాన్రాశయం కాదు. ఉద్ధానం ఎయిర్ పోర్టు. ఉపాధికి ఢోకా ఉండదు. ఇక్కడి కొబ్బరి చెట్లు ఎదిగినట్టు.. అభివృద్ధి పెరగాలి. ఎవ్వరికీ నష్టం రాదు. సవ్యంగా సర్వే సాగనిద్దాం.

వ్యతిరేకించే వారికి ఒకటే ప్రశ్న.. ఉపాధి సమస్యను పరిష్కరించాలని ప్రశ్నించండి. మీ అందరికీ ఆమోదం ఉంటేనే భూములు తీసుకుంటాం. ల్యాండ్ పూలింగ్ లో ఇబ్బంది ఉండదు. శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే… పలాస ఎయిర్ పోర్టు రావాల్సిందే, అని కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు.

పలాస లో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయంపై అవగాహన సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆదివారం పలాస లోని రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా అధికారులతో కలసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

తొలుత విమానాశ్రయ నిర్మాణ ప్రాంత వాసులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ ఏర్పాటుపై సూచనలను అడిగి తెలుసుకున్నారు. మందస మండలం బిడిమి, మెట్టూరు, చీపురుపల్లి, భేతాళపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలు తమ వాదనను వినిపించారు.

అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలందరూ ముక్తా కంఠంతో తమ సమ్మతిని తెలిపారు. ఇదే నేపథ్యంలో తమ భూములకు అందించే రేటు విషయంలో, స్థానికంగా ఉపాధి, వంద శాతం భూమిని కోల్పోయే నిర్వాసితులకు అందించాల్సిన అదనపు సహకారం వంటి విషయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

సర్వే విషయంలో కూడా ఏ గ్రామంలో ఎంతమేర భూమి అవసరం ఉన్నది అన్న విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. గ్రామస్థుల వాదనను నిశితంగా విన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి.. వాటిని నమోదు చేసుకున్నారు.

పౌర విమాన యాన మంత్రి బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అందులో మొదటి దశలో రాష్ట్రంలోని 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆలోచన చేశామని తెలిపారు. ఇదే సందర్భంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రితో చర్చించగా.. తనకు ఆ ఆలోచన ఎప్పటినుండో ఉందని నారా చంద్రబాబు నాయుడు తెలుపడం ఆనందం వేసిందని అన్నారు.

ఈ ఎయిర్ పోర్టు ను మూలపేట పోర్ట్ తో అనుసంధానం చెయ్యడం ద్వారా మరింత జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుందని.. పలాస పరిసర ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి బీజం వేసినట్టు స్పష్టం చేశారు.

కష్టాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి.. కానీ ఎయిర్ పోర్టు రాలేదు అని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. పలాస లో విమానాశ్రయ ఆలోచన తరువాత స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష విశేషంగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఎయిర్ పోర్టు నిర్మాణ ఆలోచన ప్రాధమిక అంచనా మేరకే పలాస లో అని నిర్ణయం తీసుకున్నామని, పూర్తి స్థాయి సర్వే జరిగిన తరువాతనే దాని భౌగోళిక స్వరూపం తెలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

అధికారుల సర్వేకు తోడ్పాటు లభించడం లేదని, మొదటి అడుగుకు అవకాశం ఇవ్వలేదని.. ప్రస్తుత పరిస్థితిను సమావేశానికి వివరించారు. స్థానిక రైతుల భూములు.. స్థానికుల నిర్ణయం లేకుండా తీసుకోమని.. అందరికీ అవగాహన తరువాతనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొబ్బరి, జీడి వేసే స్థానిక రైతులు.. తమ పిల్లలను మరింత ఉన్నతంగా చదివించే ఆర్థిక తోడ్పాటు, భవిష్యత్ ఉపాధి.. ఈ ఎయిర్ పోర్టుతో చేరువ అవుతాయని తెలిపారు.

వలసల జిల్లా అన్న పేరు రూపుమాపేలా జిల్లా ప్రజల్లో మార్పు రావాలని అన్నారు. అనుమానం ఉన్న రైతులు సమావేశానికి రాలేదు, వారికి కింజరాపు, గౌతు కుటుంబాలు హామీ ఇస్తున్నాయని, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిత్యం నా గ్రీవెన్స్ కార్యక్రమంలో వందలమంది ఉద్యోగాల కోసం వస్తున్నారని.. స్థానికంగా కూడా ఉపాధి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారని.. ఈ ఎయిర్పోర్ట్ ను వ్యతిరేకిస్తూ గ్రామాల్లోకి వచ్చేవారికి ఆ ఉపాధి సమస్యను పరిష్కరించాలని అడగాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.

ఎయిర్ పోర్టు లో మొత్తం 140 శాఖలు ఉన్నాయని, నడిపే పైలట్ నుండి, వాటి మెంటెనెనెస్స్, పోర్ట్ లో అమ్మే వస్తువుల వరకు అన్ని ఉపాధి అవకాశాలుగా మారుతాయని అన్నారు. ఒక్క శంషాబాద్ విమానాశ్రం ను నమ్ముకుని అయిదు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన తరువాత అక్కడ భూముల రేటు ఇరవై ముప్పై రెట్లు పెరిగాయని స్పష్టం చేశారు. దేశంలో అనేక ఎయిర్ పోర్టులకు వెళ్తే శ్రీకాకుళం వాళ్ళు ఎదురవుతున్నారని.. వారు శ్రీకాకుళం లో విమానాశ్రయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు.

కేంద్ర మంత్రిగా తాను.. తనకు పూర్తి తోడ్పాటును ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, అన్నింటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి తోడ్పాటు పలాస విమానాశ్రయానికి ఉందని.. మళ్ళీ ఇలాంటి సువర్ణావకాశం రాదని తెలిపారు. అందరినీ ఒప్పించి, మెప్పించి స్థానికంగా విమానాశ్రయ నిర్మాణాన్ని చేసి తీరుతామని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో వంద శాతం భూమిని కోల్పోయే వారికి.. వారి బాధను తీర్చేవిధంగా తిరిగి కొంత భూమిని అందించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు.

అన్ని అనుకూలిస్తే ఈ అయిదేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఉందని, నా విమానయాన శాఖ కూడా ఇందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు కట్టడానికి ఇక్కడివారికే అవకాశం వస్తుందని, కట్టిన తరువాత నైపుణ్యం ఉన్నవారికి ఉపాధి కూడా స్థానికంగా లభిస్తుందని స్పష్టం చేశారు. పైలట్ ట్రైనింగ్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో 543 మంది ఎంపీలకు ఎయిర్ పోర్టు కావాలని, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న నాకు ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు వీటినే విశేషంగా కోరుతున్నారని తెలిపారు.

బరంపురం లో ఏర్పాటునకు ఒడిశా నేతలు ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని.. పలాస ఎయిర్ పోర్టు ను అడుగుతున్నారని.. మా ఏరియాలో నిర్మించి తీరుతామని ఆయనతో స్పష్టం చేసినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. కాశ్మీర్ నుండి అండమాన్ వరకు.. తిరువనంతపురం నుండి.. ఇటు గౌహతి వరకు అనేక ఎయిర్ పోర్టు లను కడుతూ ఉన్న నేను శ్రీకాకుళం లో కట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఉద్దానం అంటే సమస్యలు కాదని.. ఉద్దానం అంటే అభివృద్ధి లా మారుతుందని తెలిపారు. ఇది పలాస ఎయిర్ పోర్టు కాదని, ఉద్దానం ఎయిర్ పోర్టు అని స్పష్టం చేశారు. సర్వే సక్రమంగా చేయనివ్వాలని, రైతులు అందర్నీ ఆదుకొనే బాధ్యత తమదని తెలిపారు. అన్ని అనుకూలించి మంచి వాతావరణంలో ప్రాజెక్ట్ నిర్మించు కుందామని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎయిర్ పోర్టు ద్వారా దేశంలో వైబ్రేషన్ రావాలని.. జిల్లాలో ప్రాజెక్ట్ ల నిర్మాణానికి భయపడేవారికి ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం సమాధానంగా మారాలని కోరారు.

ఉద్దానంలో కొబ్బరి ఎదిగేట్టు ఈ ఎయిర్ పోర్టు ఎదగాలన కోరారు. ఈ అవగాహన సదస్సు ద్వారా స్థానిక ప్రజల సమస్యలు విన్నామని, త్వరలో గ్రామాల్లో కూడా ఇదే తరహాలో సమావేశాలు జరుగుతాయని.. అన్నింటినీ పరిష్కరించి ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలక్టర్ పృథ్వీ రాజ్, కూటమి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply