ఎంత కాస్ట్‌లీ అయినా.. షెడ్‌లోకి చేరాల్సిందే

ఎంత కాస్ట్‌లీ అయినా.. షెడ్‌లోకి చేరాల్సిందే

  • ల‌గ్జ‌రీ కార్ల‌పై పెరుగుతున్న‌ మోజు
  • ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం
  • అదిరిపోయే ఫీచ‌ర్లు.. స‌రికొత్త రంగులు
  • యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్న ల‌గ్జరీ కార్లు
  • బుగాటి, లంబోర్ఘినీ, ఫెరారీపై ఆశ‌లు
  • ఆస‌క్తి, డిమాండ్‌ను బ‌ట్టి కార్ల ధ‌ర‌లు పెంపు
  • లంబోర్ఘిని సీఈఓ స్టీఫాన్ వింకెల్ మాన్ చెప్పేది ఏంటి?

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : సొంతిల్లు.. ఆ ఇంటిముందు ఓ ముచ్చ‌ట‌గొలిపే కారు ఉండాల‌నే తాప‌త్ర‌యం భార‌తీయుల్లో పెరుగుతోంది. దానికి త‌గ్గ‌ట్టే పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పేసియస్‌గా ఉండే ఎస్‌యూవీలు, మిడ్ సైజ్ ఎస్‌యూవీలు, ఎంపీవీలపై మోజు పారేసుకుంటున్నారు.

అలాగే అన్ని రకాల సౌకర్యాలు గల లగ్జరీ కార్ల కొనుగోళ్లు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఇందులో సూపర్ లగ్జరీ కార్ల విక్రయాలు పెర‌గ‌డం క‌నిపిస్తోంది. లండన్, దుబాయ్‌లోని ఏ వీధిలోనైనా నడిచి చూస్తే, ప్రకాశవంతమైన నారింజ రంగు లంబోర్గిని , సొగసైన నల్ల ఫెరారీ వెళితే, ప్రజలు ఆగిపోతారు.

వాటిని తమ ఫోన్ కెమెరాలలో బందిస్తారు.. విలాసవంతంగా, క్లాసిక్‌కు మరో రూపంగా ఉండే సూపర్ కార్లు ధనిక వర్గ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో యువత కూడా ఈ వాహనాలపై రోజు రోజుకూ మక్కువ పెంచుకుంటోంది.

కోటీశ్వ‌రుల గ్యారేజీల్లో..

అయితే, ధనవంతులు తమ హోదాకు తగిన కార్లు కొనాల‌నుకోవ‌డంలో ఇబ్బందేమీ లేదు. అందుకోసం కార్ల ధర కోట్ల రూపాయలున్నా సరే లెక్క చేయ‌ని వారున్నారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు తమ గ్యారేజీలో ఉండాల్సిందే అన్న ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది.

కోటీశ్వరుల ఇళ్లల్లో పదుల సంఖ్యలో లగ్జరీ కార్లు ఉండ‌ట‌మే దీనికి నిద‌ర్శ‌నం. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ప్రీమియం లగ్జరీ కార్లను తయారు చేస్తుంటాయి. అన్ని రకాలు ఫీచర్లను జోడించి ఆకర్షిస్తుంటాయి. కార్ల డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాయి.

అన్ని రకాల సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. కారును చూస్తేనే కళ్లు జిగేల్మనేలా ఉంటుంది. అందుకే ఈ కార్లలంటే అందరికీ మోజు. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ప్రీమియం లగ్జరీ కార్లను తయారు చేస్తున్నాయి. వాటిల్లో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు, వాటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

బుగాటి చిరోన్‌..

బుగట్టి చిరోన్ కారు ధర దాదాపు 28 కోట్లు.. అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఈ కారు సొంతం. లండన్లో సగటు ఇంటి ధర కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. అంత ధర ఉండడం వల్ల అమ్మకం అసాధ్యం అని చాలామంది అనుకోవచ్చు. కానీ, వాస్తవానికి బుగట్టిని కొనేందుకు జనం క్యూ కడుతుంటారు. ఇక.. ఇలాంటి సూపర్ కార్లు అద్భుతమైన ఇంజనీరింగ్ కలిగి ఉంటాయి. కారు ఇంజిన్లో అల్ట్రా-లైట్ కార్బన్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు. ఊహించిన దానికంటే వేగంగా వెళ్లగలవు.

‘లంబోర్ఘిని’ పై కన్ను..

ఇటలీ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘిని’ కారు కూడా సూపర్ కార్‌గా దూసుకుపోతోంది. ఈ త‌ర‌హా కార్లు ఇండియన్ రోడ్లపై ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు బుక్ చేసుకుంటే 2026లో గానీ, ఆ తర్వాత గానీ డెలివరీ అవుతుంది.

ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని లంబోర్ఘిని కార్ల తయారీ సంస్థలో తయారైన కార్లన్నీ ఇప్పటికే భారత్ కే కేటాయించింది. భారత్‌లో హురాకెన్, ఉరుస్, రెవ్యూల్టో వంటి మోడల్ కార్లు లంబోర్ఘిని విక్రయిస్తోంది. వీటిల్లో ఒక్కో కారు ధర ₹5 కోట్ల నుంచి ₹10 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

ఫెరారీపై మక్కువ..

ఇక.. ఎర్ర‌టి , న‌ల్ల‌టి రంగులో మిలమిలా మెరిసే ఫెర్రారీ అంటే చాలామంది ఇష్ట‌ప‌డుతున్నారు. మెక్ లారెన్స్, ఆస్టన్ మార్టిన్ వంటి సంస్థల సూపర్ కార్లు భారత్ రోడ్ల‌పైనా తిర‌గేస్తున్నారు. ₹2.5 కోట్ల నుంచి ₹4.55 కోట్ల మధ్య ధర పలికే ఎఎంజీ జీ63, (AMG G 63), ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మోడల్ మెర్సిడెజ్ బెంజ్, ఆడి కార్ల కోసం ఏడాది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

₹4 కోట్ల విలువైన కార్లు 2021లో 300 యూనిట్లు అమ్ముడైతే, 2022లో 450కి, 2023లో 1000కి పెరిగాయి. 2024లో 1200 నుంచి 1300 మధ్య సూపర్ లగ్జరీ కార్లు అమ్మ‌డ‌య్యాయి.. ఇక ఈ ఏడాదిలో భార‌త్​లో వివిధ ల‌గ్జ‌రీ కార్ల అమ్మ‌కాలు ఇప్ప‌టికే 2 వేలు దాటాయ‌ని అంటున్నారు.

ఒక సూపర్ కార్‌ను నిర్మించడానికి £1 మిలియన్ ఖర్చవుతుంది. అది ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు చేరేస‌రికి రెట్టింపు ధ‌ర ప‌లుకుతుంది.. అయితే.. ఇక్క‌డ ధ‌ర ముఖ్యం కాదు.. త‌మ వ‌ద్ద ల‌గ్జ‌రీ కారు ఉందా.. లేదా అనేది ధ‌నిక వ‌ర్గ ప్ర‌జ‌లు చూస్తున్నారు.

మారుతున్న మైండ్ సెట్‌..

భారతీయుల్లో జనరేషన్ మైండ్ సెట్ మారుతోందని లంబోర్ఘిని సీఈఓ స్టీఫాన్ వింకెల్ మాన్ చెప్పారు. అందువల్లే లగ్జరీ కార్లకు గిరాకి పెరుగుతుందన్నారు. అయితే.. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్​లో వృద్ధిరేటు సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. 2022 సేల్స్ తో పోలిస్తే 2025లో 14 శాతం వృద్ధితో 112యూనిట్ల లంబోర్ఘిని కార్లు అమ్ముడయ్యాయ‌న వెల్ల‌డించారు.

తక్కువ ఉత్పత్తితో డిమాండ్..

టయోటా వంటి సంస్థ ప్రతి సంవత్సరం మిలియన్ల కార్లను ఉత్పత్తి చేస్తుంది. కానీ, బుగట్టి వంటి సంస్థ 100 కంటే తక్కువ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ డిమాండ్ పెంచడం ఈ కారు కంపెనీ ఉద్దేశంగా తెలుస్తోంది. ఏదైనా అరుదుగా ఉన్నప్పుడు.. అది మరింత కావాల్సిందిగా మారుతుందనేది మానసిక నిపుణులు చెబుతుంటారు.

ఇదే సూత్రాన్ని ఈ కార్ల తయారీ కంపెనీ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కవ ధర, ఎక్కువ ఉత్పత్తి ఉంటే ప్రతి ఒక్కరూ బుగట్టిని కొనుగోలు చేయగలిగేలా ఉన్నప్పుడు అది ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది?.. ఇది ఒక వ్యూహంగా.. ఉత్పత్తిని తక్కువగా ఉంచడం ద్వారా.. కార్ల తయారీదారులు చెబుతుంటారు.

-నీల్ వేణుటూరుపల్లి

Leave a Reply