• స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం


ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో : అల్పపీడన ద్రోని ప్రభావంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు అధికార యంత్రాంగం హైఅలెర్ట్ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాను వరదలు ముంచెత్తడంతో ఇంటి నుండి బయటకు రావద్దని కలెక్టర్ అభిలాష, ఎస్పీ జానకి హెచ్చరికలు జారీ చేశారు. నిర్మల్ (Nirmal) పట్టణంలోని శివాజీ చౌక్, ప్రియదర్శిని నగర్, బస్సు డిపో కాలనీ నీట మునగడంతో లోతట్టు ప్రాంతాలను అధికార యంత్రాంగం ఖాళీ చేయించి పునరావస చర్యలు చేపట్టింది. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) భారీ వర్షాన్ని లెక్క చేయకుండా రాత్రంతా వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

  • ఎస్సారెస్పీ గేట్లు తెరవడంతో గోదావరి ఉప్పెనల ప్రవహిస్తోంది.
  • పెనుగంగా వద్ద వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న వాహనాలను నిలిపివేశారు.
  • హైదరాబాద్‌ రాకపోకలు నిలిచిపోవడంతో, కరీంనగర్ జిల్లా మీదుగా జిల్లా ప్రజలు వెళ్లారు.
  • తరణం లో లేబర్ వంతెన పైనుండి వరద పోటెత్తడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.
  • లక్ష్మణ చాంద మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి శంకర్ నాయక్ వాగు దాటి ఇంటికి చేరలేక 24 గంటలు బిక్కుబిక్కుమంటూ చిక్కుకున్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు డ్రోన్ కెమెరా సాయంతో మొబైల్ ఫోన్, ఆహారం పంపించి ఆ తర్వాత గజ ఈతగాళ్ళ సాయంతో నాటు పడవను పంపి సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు.
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్, ఎస్పీ జానకి షర్మిల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. -నిర్మల్ జిల్లా భారీ వర్షాలకు డేంజర్ జోన్ లో చిక్కుకున్నందున పోలీసు బృందాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
  • గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అక్కాపూర్ కేంద్రంలో 33.5 సెంటీమీటర్ల వర్షం కురియడం రికార్డుగా చెప్పవచ్చు.
  • కడెం జలాశయంలోకి గంట గంటకు వరద ప్రవాహం పెరగడంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆరు గేట్లు ఎత్తివేసి 40,138 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు.
  • వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశించారు.

Leave a Reply