మృతుల్లో తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు..
చలించిన ప్రజాప్రతినిధులు ..
(శ్రీకాకుళం/పలాస, ఆంధ్రప్రభ బ్యూరో) శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శనివారం నాడు అక్కడ కొత్తగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో జరిగిన తోపులాటలో పది మంది మరణించారు (Ten people died). మృతులలో 9 మంది మహిళలు కాగా 9 సంవత్సరాల బాలుడు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
కాశిబుగ్గ ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నాలుగు సంవత్సరాల క్రితం హరీముకుంద్ పండా (Harimukund Panda) అనే భక్తుడు నిర్మాణం ప్రారంభించాడు. ఈ సంవత్సరం మే నెలలో దీని నిర్మాణం పూర్తయి ప్రతిష్టా కార్యక్రమాలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆలయానికి భక్తుల సంఖ్య రావడం పెరిగింది.
ప్రతి శనివారం కనీసం 2000 మంది వరకు స్వామి వారిని దర్శించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మొదటి అంతస్తులో మెట్లు ఎక్కి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. తిరిగి వచ్చేందుకు వేరే మార్గంలో మెట్లు దిగి రావాల్సి ఉంది. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం కావడంతో ఎంతో ప్రాశస్ట్యం ఉన్న రోజుగా ఈ శనివారం నాడు భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ( Venkateswara Swamy Temple) తరలి వచ్చారు.
సాధారణంగా ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వైష్ణవాలయాలకు వెళుతుంటారు. వైకుంఠ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి వంటి పుణ్య తిధులలొ అధిక సంఖ్యలో భక్తులు వైష్ణవాలయలకు వెళ్లి దర్శించుకోవడం జరుగుతుంది. అయితే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం కొత్తగా నిర్మించడం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎంతమంది ఆలయానికి వస్తారన్నది ముందస్తుగా ఆలయ నిర్వాహకులు అంచనా వేయకపోవడంతో దాదాపు 30 వేల మంది ఒకేసారి ఆలయానికి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది.
ఉదయం తొమ్మిది గంటల వరకు భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొని తిరిగి కిందకు వచ్చే కార్యక్రమం సాఫీగానే జరిగింది. అయితే స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వెళ్లేందుకు ఉద్దేశించిన మెట్లపై నుండి అనేక మంది తోసుకుంటూ రావడంతో ఇరుపక్కల నుంచి భక్తులు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోయింది. ఇదే సమయంలో మెట్ల పక్కన నిర్మించిన రెయిలింగ్ ఊడిపోవడంతో ఒక్కసారిగా మెట్ల పైన ఉన్న భక్తులు కిందనే ఉన్న భక్తులపై పడిపోయారు. దాంతో అనేకమంది ఊపిరాడక అలానే ఉండిపోయారు. సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఏడుగురు ప్రాణాలు వదలగా 16 మందిని కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు.
ఆసుపత్రిలో మరో ఇద్దరు మహిళలతో పాటు తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా మృతి చెందాడు. దీంతో మొత్తం పదిమంది చనిపోయారు. ఒక్కసారిగా అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్న భక్తులను షాక్ గురిచేసింది. చనిపోయిన వారిని చూసిన బంధువులు, గాయపడినవారి ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ సంఘటనతో భయపడిన భక్తులు, అదే విధంగా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు అరుపులతో ఆ ప్రాంగణం అంతా మృత్యుఘోష వినిపించినట్లయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష అక్కడికి చేరుకున్నారు.
కాశీబుగ్గ డి.ఎస్.పి, సీఐ, పోలీసులతోపాటు అనేక మంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ముందుగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరిద్దరు తీవ్రంగా గాయపడి ఉండడంతో వారిని శ్రీకాకుళం రింస్ కు తరలించారు ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి జిల్లాలో ఉన్న మంత్రి అచ్చెం నాయుడినిను కాశీబుగ్గ వెళ్లవలసిందిగా ఆదేశించడంతో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) టెక్కలి నియోజక వర్గంలో తన కార్యక్రమాలను రద్దు చేసుకొని కాశీబుగ్గ చేరుకున్నారు. అదే విధంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విజయనగరం కు చెందిన కొండపల్లి శ్రీనివాస్ కూడా విజయనగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విరమించుకొని కాశీబుగ్గ బయలుదేరారు.
జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఆదేశించారు. ఈ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ చేరుకొని ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. ప్రస్తుతం కాశీబుగ్గలో చికిత్స పొందుతున్న వారు స్వల్ప గాయాలతోనే ఉన్నారని, ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేస్తూ ఈ సంఘటనలో మొత్తం తొమ్మిది మంది మహిళలతో సహా పదిమంది చనిపోయినట్లు తెలిపారు. జిల్లాలో ఆలయాలలో ఇంతటి దుర్ఘటన జరగడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
చలించిన నేతలు…
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట దుర్ఘటనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చలించిపోయారు. ప్రమాదస్థలికి చేరుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు..సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏడాది కిందటే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. పండా అనే భక్తుడు తన సొంత భూమిలో రూ. 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

