NH65 Uproar : విప్తరణం Andhra Prabha SPL Story

NH65 Uproar : విప్తరణం Andhra Prabha SPL Story
- హైవే 6 లైన్ల రచ్చ
- భూసేకరణం షురూ
- కృష్ణారైతుల గగ్లోలు
- ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే కాదు
- గ్రేవ్ ఫీల్డ్ హెల్ వే.. జనం ఆందోళన
- బఫర్ జోన్ గల్లంతు
- అటు మున్నేరు..వైరా వాగుల దూకుడు
- ఇటు ప్రకాశం బ్యారేజీకి చిక్కులు
- ఎన్టీఆర్ జిల్లా రైతులు ససేమిరా
- ₹ 5,200 కోట్ల ప్రాజెక్టుకు వివాదాల బారికేడ్
(ఆంధ్రప్రభ, కంచికచర్ల)
ప్రభుత్వ నూతనంగా నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే కాస్త.. గ్రేవ్ ఫీల్డ్ హెల్ వేగా మారబోతోందని కృష్ణానది పరివాహక గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ ఎన్ హెచ్ 65 రోడ్డు విస్తరణతో భారీ వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
NH 65 Uproar

ఈ క్రొత్త రహదారి నిర్మాణం పూర్తయితే కృష్ణా నది ఒడ్డు గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచిఉంది. కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకూ ప్రస్తుతం ఉన్న 65వ నెంబరు జాతీయ రహదారి స్థానంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ ప్రతిపాదనలతో ఆయా ప్రాంత వివిధ వర్గాల ప్రజలు, రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒక ప్రక్క తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి నూతనంగా అమరావతికి పరిటాల మీదుగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణానది వరదల నుంచి తట్టుకోవడానికి రైల్వే లైన్ ను పది అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.
NH 65 Uproar

ఈ రైల్వే లైన్ నిర్మాణం కూడా వరదపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి తోడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం కూడా చేపడితే కృష్ణానది పరివాహక గ్రామాలను వరద ముంచేత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టు డిపిఆర్
కూడా సిద్ధమవడంతో కచ్చితంగా ఈ రహదారి నిర్మిస్తారని, దీనివల్ల పంటపొలాలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు కృష్ణా నది వరద, తమ గ్రామాలను ముంచేస్తుందని ఆందోళన పెరుగుతోంది.
NH 65 Uproar

ఇప్పటికే కంచికచర్ల ప్రాంతంలో పాత జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, రైల్వే లైను, అవుటర్ రింగురోడ్డు, ఇన్నర్ రింగురోడ్డుకు విడతల వారీ పొలాలు ఇచ్చామని, ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో మిగిలిన పొలాలు కూడా పోతే రైతులు ఆర్థికంగా చితికి పోవడం తప్ప వారికి మిగిలేది ఏమీ ఉండదు. ఈ రహదారితో కృష్ణానదికి వరద ఒత్తిడి పెరిగే ప్రమాదమూ ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారిని ఇప్పుడున్న నేలమట్టానికి కనీసం పది అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే కృష్ణానదికి కరకట్ట మాదిరిగా నిర్మించబడుతుంది. వాస్తవంగా కృష్ణానది వరద వచ్చిన సమయంలో బ్యారేజీ ఎగువ భాగంలో కీసర మున్నేరు వరకూ బఫర్ జోన్ గా వదిలారు.
NH 65 Uproar

10 లక్షలు క్యూసెక్కులు కన్నా ఎక్కువ వరద కృష్ణానదికి సంభవిస్తే, పెద్దయెత్తున ప్రకాశం బ్యాల్టేజీపై ఒత్తిడి పెరగకుండా వరద నీరు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలంలో పలు గ్రామాలకు విస్తరించి ప్రకాశం బ్యారేజ్ పై ఒత్తిడి తగ్గుతుంది. నెమ్మదిగా ఆ ప్రవాహం దిగువకు వెళ్ళతుంది. ఈ సమయంలో రైల్వే లైన్ తో పాటు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మిస్తే, బఫర్ జోన్ కుచించుకుపోవడంతో వరద ప్రవాహం బ్యారేజ్ పైన, నదీ పరివాహక గ్రామాల పైన, ఆ తర్వాత రాజధాని వైపు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమరావతి నుంచి దిగువకు గుంటూరు జిల్లాలో కరకట్ట నిర్మించారు.
NH 65 Uproar

అదే సమయంలో మెరకగా ఉందని, మున్నేరు వైపునుండి వచ్చే వరద పెరిగినా ఇబ్బంది ఉండకూడదనే కోణంలో ఉమ్మడి కృష్ణా జిల్లావైపు కరకట్టను నిర్మించకుండా బఫర్ జోన్ గా వదిలేశారు. దీనివల్ల ఇటీవల వచ్చిన పరదల్లో ఎన్టిఆర్ జిల్లా వైపు కీసర మునేరు వరకు వరదనీరు విస్తరించడం వల్ల బ్యారేజీకి నీటి ఒత్తిడి తగ్గిందని అధికారులూ తెలిపారు. వరద పెరిగిన పరిస్థితుల్లో ఒక అడుగు మేర నీరు బఫర్ జోన్ లోకి చేరితే బ్యారేజ్ కి ఒక టీఎంసీ నీటి ప్రవాహం తగ్గుతుందనేది నిపుణుల వాదన. దీనిని బట్టి గత అనుభవాల దృష్ట్యా బఫర్ జోన్ లోకి నీళ్లు పది అడుగుల మేర వ్యాపించి ప్రస్తుతం ఉన్న 65 నెంబర్ జాతీయ రహదారిపై గుండా ప్రవహించి, ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆమేర బ్యారేజ్ మీద ఒత్తిడి తగ్గినట్లే కదా. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ రహదారిని 10 నుండి 12 ఆడుగుల ఎత్తులో నిర్మిస్తే కృష్ణానదికి వరద ఒత్తిడి పెరుగుతుందనేది అధికారులూ చెతున్నారు.
NH 65 Uproar
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రవహించే వైరా ఏరు, మునేరు కట్టలేరులతో పాటు, కంచికచర్ల మండలంలో ప్రవహించే ఏనుగడ్డువాగు, నక్కల వాగు, తోలవాగుల నుండి వచ్చే వరదతో పాటు కంచికచర్ల, పరిటాల వంటి పెద్ద చెరువుల నుండి వచ్చే వరద నదిలోకి వెళ్లే మార్గాలు లేక గ్రామాలను ముంచెత్తుతుంది. అప్పుడు జరిగే భారీ నష్టాలను ఊహించలేము. ఇప్పటికే నదికి వరదలు వచ్చిన సమయంలో వారాల తరబడి పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణానది వరద ఉధృతి నదికి ఉత్తరం వైపు విస్తరించే మార్గాలు లేక, ఈ ఒత్తిడి గుంటూరు జిల్లావైపు అమరావతికి తగులుతుందనే అనుమానాన్ని నిపుణులు సైతం వ్యక్తం చేస్తున్నారు.
NH 65 Uproar
పెద్ద పెద్ద చెరువులు ఆయుకట్ల సమీపంలో కూడా జాతీయ రహదారులు నిర్మించకూడదనే నిబంధన కూడా ఉందనే విషయం గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకూ విస్తరించే రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.5,200 కోట్లు ఖర్చవుతుందని లెక్కలేశారు. అదే పాత జాతీయ రహదారికి గతంలో తీసుకున్న భూమిని విస్తరించి, ఇళ్లు ఉన్నచోట్ల వాటికి ఇబ్బంది లేకుండా ఫ్లై ఓవర్లు నిర్మిస్తే రూ.3,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. మిగిలిన సొమ్ముతో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇదే అంశాన్ని రైతులు కూడా ముందుకు తెస్తున్నారు. పాత జాతీయ రహదారిని విస్తరిస్తే కలిగే మేలుపై ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తే బాగుంటుంది. కొత్త రహదారి నిర్మాణానికి 70 మీటర్ల వెడల్పు ప్రతిపాదించారు.
NH 65 Uproar
దీనివల్ల ఒక్క పరిటాల గ్రామంలోనే 80 ఎకరాల వరకూ భూమి అవసరం అవుతుంది. చిలుకూరులో 80 ఎకరాలు… ఇలా దాములూరు, కోటికలపూడి తదితర గ్రామాల్లో భూములు కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా త జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, రైల్వే లైను, అవుటర్ రింగురోడ్డు, ఇన్నర్ రింగురోడ్డుకు విడతల వారీ పొలాలు ఇచ్చుకుంటూపోతే.. భూములు మొత్తం కోల్పోయి తాము ఆర్థికంగా చితికి పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NH 65 Uproar

గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని ఇప్పటికే పలు గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ, జాతీయ రహదారుల శాఖ అధికారులను కూడా స్వయంగా కలిసి తమ విజ్ఞాపనలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్జీలు సమర్పించారు. స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటు వల్ల వచ్చే అనర్ధాలను గమనించి దీన్ని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించి నివేదికలు తెప్పించి, కృష్ణానది ముంపు నుండి నదీ పరివాహ గ్రామాలను కాపాడటంతో పాటు విలువైన ప్రజల, పశుపక్ష్యాదుల ప్రాణాలతోపాటు పంట పొలాలను, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
NH 65 Uproar

ఇప్పటికే కంచికచర్ల బైపాస్ గా ఉన్న 65వ నెంబర్ జాతీయ రహదారి ఆరు వరుసలు, సర్వీసు రోడ్లతో కలిపి మొత్తం 10 వరుసలుగా ఉంది. దీన్ని యధావిధిగా పరిటాల దొనబండ కేతనకొండ మూలపాడు జూపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వరకు విస్తరిస్తే అందరికీ ఎంతో మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట దఫాలుగా భూములు కోల్పోవడాన్ని కూడా రైతులు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం చేపట్టే అనవసరమైన వాటికి కూడా తమ విలువైన భూములు ఇచ్చుకుంటూ పోతే రైతులు ఎలా బ్రతకాలన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కూడా తమకు కష్టాలే మిగులుస్తుందా…అని ఈ ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. కార్పొరేట్ కంపెనీలను కాపాడుతున్న ప్రభుత్వాలు తమ కష్టాలను విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
NH 65 Uproar

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రస్తుతం ఉన్న 65వ నెంబర్ జాతీయ రహదారినే ఆరు లైన్లుగా విస్తరించాలని, గ్రామాలు, ఇళ్లకు ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్లు నిర్మించే పద్ధతిలో విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. తమ విజ్ఞాపనల పట్ల సానుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు మేలుచేయాలని, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటు విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని ఈ ప్రాంత ప్రజలు, రైతులు కూలీలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.
ALSO READ : gas cylinder shortage | గ్యాస్ డెలివర్రీ
