New Weapon | కాంతి ఖడ్గం – ఇజ్రాయెల్ చేతిలో లేజ‌ర్ వెప‌న్‌

తొలిసారి వార్‌లో వినియోగించిన‌ట్టు వెల్ల‌డి
ప్ర‌త్య‌ర్థి డ్రోన్ల‌ను కూల్చేసిన‌ట్టు వీడియో రిలీజ్‌
ఐర‌న్ బీమ్ వ్య‌వ‌స్థ‌లో ఇదో స‌రికొత్త ఆయుధం
హెజ్‌బొల్లా దాడుల‌ను అడ్డుకునేందుకు చ‌ర్య‌లు
వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు, లేజ‌ర్ వ్య‌వ‌స్థ‌ల మోహ‌రింపు
యుద్ధ విమానాల సంస్థ రాఫెల్ ఆధ్వ‌ర్యంలో త‌యారీ
ప్ర‌పంచంలోనే ఇది తొలి వెప‌న్ అంటున్న ఐడీఎఫ్‌

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఇజ్రాయెల్‌ తమ అమ్ముల పొదిలోని కాంతి ఖడ్గం శక్తిని యుద్ధంలో పరీక్షించింది. డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చింది. తాము లేజర్‌ ఆయుధమైన ఐరన్‌ బీమ్‌ వ్యవస్థలో తక్కువ శక్తిమంతమైన ఆయుధం వాడినట్లు ఆ దేశ రక్షణ శాఖ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించాయి. ఈ సరికొత్త సిస్టమ్‌లో తక్కువ శక్తి లేజర్‌ బీమ్‌ను తాము ఇంటర్‌సెప్టర్‌గా యుద్ధంలో వాడినట్లు పేర్కొన్నాయి. దీన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో సైన్యానికి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ సంస్థ అభివృద్ధి చేసింది. హెజ్‌బొల్లా నుంచి డ్రోన్ల ముప్పు పెరగడంతో అనుకున్న సమయం కంటే వేగంగా దీన్ని రూపొందించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

ప్ర‌పంచ‌లోనే తొలిసారి..

‘‘ప్రస్తుత యుద్ధంలో మా వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా.. లేజర్ వ్యవస్థలను కూడా మోహరించాము. అవి చాలా అద్భుతంగా పనిచేశాయి. శత్రువులు ప్రయోగించిన ఆయుధాలను అద్భుతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడటంతోపాటు.. దేశ ఆస్తులను రక్షించాయి’’ అని ఐడీఎఫ్‌, ఇజ్రాయెల్‌ రక్షణశాఖ వెల్లడించాయి. ఈ మేరకు ఐరన్‌ బీమ్‌ వ్యవస్థ విజయవంతంగా డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. మరోవైపు రఫేల్‌ సంస్థ చైర్మన్‌ యువల్‌ స్టెయింట్జ్‌ స్పందిస్తూ..‘‘ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తిమంతమైన లేజర్‌ను పూర్తిగా వినియోగించి.. యుద్ధాల్లో ఇంటర్‌ సెప్టర్‌ వాడిన దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది’’ అని పేర్కొన్నారు.

మూడు శ్రేణుల్లో లేజర్ల అభివృద్ధి..

ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు మూడు శ్రేణుల్లో లేజర్‌ ఆయుధాలను అభివృద్ధి చేసింది. వీటిల్లో ఐరన్‌ బీమ్‌-ఎం అనేది భారీ వాహనాలపై అమర్చే శక్తిమంతమైన ఆయుధం. ఇది 50 కిలోవాట్ల శ్రేణి లేజర్‌తో ప్రత్యర్థి ఆయుధాలను కూల్చేస్తుంది. వివిధ లేయర్లు ఉండే రక్షణ వ్యవస్థల్లో భాగంగా దీన్ని వాడొచ్చు. ఐరన్‌ బీమ్‌లోనే తేలికపాటి వెర్షన్‌గా భావించి లైట్‌ బీమ్‌ను కూడా అభివృద్ధి చేశారు. దీన్ని చిన్న వాహనాలపై అమర్చి ఉపయోగించవచ్చు. ఇది 10 కిలోవాట్ల శ్రేణి హైఎనర్జీ లేజర్‌ ఆయుధం. యూఏవీలు, డ్రోన్ల దండుపై ప్రభావంతంగా పనిచేస్తోంది. దీంతో ప్రత్యర్థి డ్రోన్లను కూల్చడానికి అయ్యే ఖర్చు నామమాత్రమే అని రఫేల్‌ కంపెనీ వెల్లడించింది. ఏకకాలంలో కొన్ని కిలోమీటర్ల దూరంలోని 10 లక్ష్యాలను ఇది కూల్చగలదు.

యుద్ధ నౌక‌ల‌ను కాపాడేందుకు..

ఇక.. యుద్ధ నౌకల పైనుంచి వినియోగించే నేవల్‌ ఐరన్‌బీమ్‌ను కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌, రక్ష‌ణ శాఖ‌ అభివృద్ధి చేశాయి. ఇది 100 కిలోవాట్ల హైఎనర్జీ లేజర్‌ను వాడి యుద్ధ నౌకలను రక్షిస్తుంది. యుద్ధనౌకలపై ఉన్న రక్షణ వ్యవస్థలు పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న ముప్పుతో (సాచురేటెడ్‌ అటాక్‌) బిజీగా మారినప్పుడు ఇది శక్తిమంతంగా పనిచేస్తుంది. కొన్ని వందల మీటర్ల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ముప్పును ఇది అడ్డుకొంటుంది. ఇంటర్‌సెప్షన్‌కు అయ్యే ఖర్చు కూడా చాలా నామమాత్రమని త‌యారీ సంస్థ ర‌ఫేల్ చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *