స్మగ్లర్లు, వేటగాళ్లకు కొత్త భయం..

జన్నారం (ఆంధ్రప్రభ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్‌లో డాగ్ స్క్వాడ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈసారి ఆ నూతన జాగిలానికి “హంటర్” అని పేరు పెట్టారు. కలప స్మగ్లర్లను, వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోవడంలో హంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు అటవీ అధికారులు, నైపుణ్యం గల జాగిలంతో కలిసి రాష్ట్ర అటవీ శాఖలో జన్నారం కేంద్రంగా కొత్త డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం సహాయంతో కలప స్మగ్లర్లను, వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించి పట్టుకుంటున్నారు.

ఇంతకుముందు కూడా జన్నారంలో డాగ్ స్క్వాడ్ పనిచేసింది. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పాత జాగిలాలు చనిపోవడంతో ఏడాది పాటు ఈ సేవలు నిలిచిపోయాయి. తాజాగా మళ్లీ డాగ్ స్క్వాడ్ ఏర్పాటుతో స్మగ్లర్లలో, వేటగాళ్లలో భయం నెలకొంది.

స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ మాట్లాడుతూ, డాగ్ స్క్వాడ్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులు వినియోగించుకోవాలని సూచించారు.

హంటర్ తొలి ఆపరేషన్ సక్సెస్..

ఈ నెల 14వ తేదీ రాత్రి జన్నారం రేంజ్‌లోని గొండుగూడ ఫారెస్ట్ బీట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 310లో ఒక కలప స్మగ్లర్ గొడ్డలితో విలువైన టేకు చెట్టును నరికివేస్తుండ‌గా.. పసిగట్టిన స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జె.లాల్‌భాయ్ అక్కడికి వెళ్ళగానే స్మగ్లర్ పరారయ్యాడు.

అప్పుడే డాగ్ స్క్వాడ్‌ను అక్కడికి తీసుకువచ్చి ఆ షర్టు వాసన చూపించారు. వెంటనే హంటర్ వాసన పట్టి, జన్నారం మండలంలోని జువ్విగూడ గ్రామానికి చేరుకుని స్మగ్లర్ రాథోడ్ హరిలాల్ ఇంటి వద్ద మొరగడం మొదలుపెట్టింది. అప్పటికే హరిలాల్ ఇంటి నుంచి పారిపోయాడు. అయితే, హంటర్ సహకారంతో ఆ చెట్టును నరికింది హరిలాల్ అని నిర్ధారించి, అటవీ అధికారులు కేసు నమోదు చేశారు

Leave a Reply