Nellore | బ్లేడ్, గంజాయి బ్యాచ్ లను ప్రొత్సహించడమే జగన్ పని – నారా లోకేష్

నెల్లూరు | “మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 164 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. ఆనాడే మేము భయపడలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన మీ బెదిరింపులకు భయపడతామా?” అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన పర్యటనలంటేనే ప్రజల ప్రాణాలు తీయడమని ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని (Nellore ) అనిల్ గార్డెన్స్‌లో (anil gardens ) టీడీపీ పట్టణ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో (Former CM Jagan Reddy) మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాఫ్టర్లలోనే (helicopter ) తిరుగుతున్నారని అన్నారు

మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తున్నారని.. పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారని మండిపడ్డారు. ‘జనసమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కార్యకర్త కారు కిందపడితే కనీసం దిగి చూడలేదు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా? సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు’ అంటూ ఫైర్ అయ్యారు.

వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బ్లేడ్ బ్యాచ్‌ను, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారని.. అప్పుడే భయపడలేదని.. రప్పా, రప్పాకు భయపడతామా అని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందన్నారు. కానీ తిరగమంటే మనుషులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారన్నారని మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు.

వారే నాకు స్ఫూర్తి
తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్త అని మంత్రి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. అంజిరెడ్డి తాత, మంజులా రెడ్డి, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. కార్యకర్తల పోరాటాన్ని విస్మరించకూడదన్నారు. తనను అనేక విధాలుగా అవమానించారని.. 164 సీట్లతో రికార్డ్ బ్రేక్ చేశామన్నారు. దేశ చరిత్రలో 94 శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుందని… ఇందుకు కారణం కార్యకర్తలే అని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలిసిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకే సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఏదైనా నిర్ణయంలో సమస్యలు ఉంటే వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని కార్యకర్తలకు మంత్రి లోకేష్ తెలిపారు.

‘నేడు పోలీసులు మనకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదే పోలీసులు మనం ప్రతిపక్షంలో ఉండగా ఇబ్బందులకు గురిచేశారని’ పేర్కొన్నారు. ‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. ఒక్కసారి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత తలవంచి పనిచేస్తా. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు పస్ట్. కార్యకర్తలు అలక మానుకోవాలి. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలి’ అని లోకేష్ పిలుపునిచ్చారు.

ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు

ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే డీఎస్సీ ద్వారా ఆగష్టు నాటికి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ప్రకటించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని, రూ.2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టామని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిఫైనరీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందిస్తున్నామని.. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు. జగన్ రెడ్డి అహంకారం వల్లే 151 సీట్లు 11 అయ్యాయనన్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని… బాధ్యతగా పనిచేయాలని.. మార్పుకోసం, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని గుర్తుంచుకోవాలని కార్యకర్తలకు మంత్ర దిశానిర్దేశం చేశారు.

సమన్వయ సమావేశం అనంతరం దాదాపు 1500 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేపీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద చిన్నారులకు కొత్త వెలుగులు

వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నిరుపేద చిన్నారుల జీవితాల్లో లోకేశ్ కొత్త వెలుగులు నింపారు. చదువుకోవాలన్న వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, వారికి నెల్లూరులోని ప్రతిష్టాత్మక వీఆర్ హైస్కూల్‌లో అడ్మిషన్ కల్పించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే, సోమవారం నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, గత శనివారం తమను పాఠశాలలో చేర్పించాలని కమిషనర్‌ను కోరిన సీహెచ్ పెంచలయ్య, వి.వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్, ఆ చిన్నారులిద్దరికీ అదే పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. వారి అడ్మిషన్ ఫారాలను స్వయంగా పాఠశాల ఏవీఓ వెంకటరమణకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “ఈ చిన్నారుల విద్యాభ్యాసానికి పూర్తిగా అండగా ఉంటాను. వారు కష్టపడి చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలి” అని ఆకాంక్షించారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. మంత్రి చూపిన చొరవతో ఆ చిన్నారుల జీవితం కొత్త మలుపు తిరిగినట్లయింది.

Leave a Reply