ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా…

ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా…

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ – నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక మంది నిరుపేదలు వైద్యసౌకర్యాల లేమితో ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యాయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ఏర్పాటుకు బీజేపీ తరఫున ఎన్నిసార్లు పోరాటాలు చేసినా, పాలకుల్లో మాత్రం చలనం చూపించడం లేదు. జిల్లా కేంద్రంలో సరైన వైద్యసదుపాయాలు లేక ప్రజలు ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించే దుస్థితి నెలకొందని సత్యాయాదవ్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ఏర్పాటుకు బీబేజీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించామని, ఆ సమ్మెకు విస్తృతమైన ప్రజా మద్దతు లభించిందని చెప్పారు.

అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మళ్లీ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చామని, దాంతో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.7 కోట్లు 45 లక్షల నిధులు మంజూరు చేయించామని, అదనంగా ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికరెడ్డి తన ప్రత్యేక నిధుల నుంచి మరో కోటి రూపాయలు కేటాయించి, మొత్తం రూ.8 కోట్లు 45 లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌గా మార్చే ప్రతిపాదనను ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత కాలం గడిచినా ప్రభుత్వం కేవలం కాగితాల పైనే ఈ ప్రాజెక్ట్‌ను ఉంచడం చాలా విచారకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అని చెప్పుకుంటున్న నారాయణపేట, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అభివృద్ధిలో చివరిస్థానంలో ఉందనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించాలని సత్యాయాదవ్ విమర్శించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే వరకు బిజెపి తలవంచదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పళ్ల హనుమాన్ మందిరం నుంచి సెంటర్ చౌక్, సత్యనారాయణ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. “ఇంతకీ స్పందించకపోతే, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి, తరువాత కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు కూడా చేపడతాం,” అని ఆయన హెచ్చరించారు.

ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అసహనకరమని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో తగిన సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు బీజేపీ ప్రధాన డిమాండుగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షులు నందు నామాజీ, ఒబిసి మోర్చా మాజీ అధ్యక్షులు మిర్చి వెంకటయ్య, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply