NEET | నీట్ ప‌రీక్ష రాసిన త‌ల్లీ, కుమార్తె…

కాకినాడ‌లో నీట్ కు 72 ఏళ్ల వృద్దురాలు హాజ‌రు..

హైద‌రాబాద్ – వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలు మే 4వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారుగా 22.3 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు ఓ మహిళ తన కుమార్తెతో కలిసి హాజరైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన నీట్ పరీక్షల్లో వీరిద్దరూ వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాశారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత (38) ప్రస్తుతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. 2007లో బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో ఉండగా వివాహం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు జన్మించడంతో కోర్సును పూర్తి చేయలేకపోయారు.

అయితే, ఆమె భర్త భూక్యా కిషన్ కూడా ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ తమ కుమార్తెను ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చేయాలనుకున్నారు. ఖమ్మంలో కుమార్తె నీట్ శిక్షణ పొందుతున్న సమయంలో తల్లికి కూడా పరీక్ష రాయానే ఆకాంక్ష కలిగింది. దీంతో ఆమె కూడా పరీక్షకు సన్నద్ధమయ్యారు. తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వం జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలోనూ, కుమార్తె కావేరి ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్సీ క్యాంపు కేంద్రంలో పరీక్ష రాశారు.

ప‌రీక్ష రాసిన 72 ఏళ్ల వృద్ధురాలు ..

ఇక చదువుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు ప్రతిబంధకం కాబోదని కాకినాడకు చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు నిరూపించారు. నగరానికి చెందిన పోతుల వెంకటలక్ష్మి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష రాశారు. ఈ వయసులోనూ ఉత్సాహంగా పరీక్ష రాయడానికి వచ్చిన బామ్మను అందరూ ఆసక్తిగా తిలకించారు. ఉన్నత చదువులపై ఈ పెద్దావిడకున్న ఆసక్తి పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *