ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
Narayanpet Collector | ఊట్కూర్, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఆయా వార్డులు తిరిగి సమస్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు.

మండలంలోని కొల్లూరు హెల్త్ సబ్ సెంటర్ నుంచి మక్తల్‌కు ప్రసవాల కోసం గర్భిణులు వెళ్తుండగా పగిడిమర్రి సబ్ సెంటర్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళుతున్నారని డాక్టర్ సంతోషి కలెక్టర్‌కు వివరించారు. అంతకుముందు రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగితెలుసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు రోగులకు వైద్య చికిత్సలు సకాలంలో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, డాక్టర్ సంతోషి, పీఆర్ఏఈ అజయ్ రెడ్డి, సర్వేయర్ జయశంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

