శంకర్పల్లిలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం

శంకర్పల్లిలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం
- 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
శంకర్పల్లి, ఆంధ్రప్రభ : శంకర్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నారాయణ స్కూల్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 53 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. బస్సులో మోకిల తండా, కొండకల్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

ప్రమాద వార్త పట్టణంలో వేగంగా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను శంకర్పల్లి పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో వైద్యులతో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి యాజమాన్యం మరియు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

