Nandyal | ప్రపంచమంతా భారత్ వైపే చూపు..
- దేశంలో సుపరిపాలన మోడీతోనే సాధ్యం
- రాష్ట్రవ్యాప్తంగా అటల్ -మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం
- ఘనంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహం ఆవిష్కరణ
- రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి
Nandyal | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారతదేశ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణమని రాష్ర్ట మంత్రులు అన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర రోడ్డు భవనాల రహదారులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవన్, విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అటల్ బిహారి వాజ్‌పేయి దూరదృష్టి పాలనకు, ప్రధాని నరేంద్ర మోదీ సుపరి పాలనకు ప్రజలను మరింత దగ్గర చేసే ఉద్దేశంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశం అన్నిరంగాల్లో ముందుకు సాగడానికి బలమైన నాయకత్వం ఎంత కీలకమో వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పేదల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయాన్నారు. అటల్ జీ చూపిన విలువలు, మోదీ అమలు చేస్తున్న సంస్కరణలు భారత దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ దేశాభివృద్ధికి తోడ్పడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు. అటల్ – మోదీ సూపరిపాలన యాత్ర ప్రజల్లో నమ్మకాన్ని, ఆశలను మరింత బల పరుస్తుందన్నారు. అనంతరం పట్టణంలో అటల్ వాజ్ పాయ్ భారీ విగ్రహాన్ని ప్రారంభించారు.


