Nandigama | ఎంపీ గారు.. అదరగొట్టారు..

Nandigama | ఎంపీ గారు.. అదరగొట్టారు..

  • నందిగామలో డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన ఎంపీ
  • గ్రామీణ క్రీడా ప్రతిభ వెలికి తీసే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు
  • ఏసీఏ ఆధ్వర్యంలో 88 నియోజకవర్గాల్లో రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్..
  • ఏప్రిల్ 5న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం

Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నందిగామ పట్టణంలో ఆర్‌సీఎం చర్చ్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీని ఎంపీ కేశినేని శివనాథ్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిసి ప్రారంభించారు.

Nandigama

విజయవాడలో ఉన్న సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నందిగామలో బాక్స్ క్రికెట్, క్రికెట్ సాధన కోసం ప్రత్యేక నెట్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎంపీ అభినందించారు. అనంతరం కేశినేని శివనాథ్ కాసేపు సరదాగా క్రికెట్ ఆడుతూ యువకులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నం స్టేడియానికి ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే వచ్చాయని, తాము బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో పది అంతర్జాతీయ మ్యాచ్‌లు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాల్లోని క్రికెట్ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు తాత్కాలిక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

Nandigama

ఇందుకోసం రెండు వాహనాల నిండా క్రికెట్ నెట్‌లు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 88 నియోజకవర్గాల నుంచి ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్‌మన్‌లు, స్పిన్ బౌలర్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఏసీఏ ఆధ్వర్యంలో మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఒక అకాడమీ ప్రారంభించి, అక్కడ వేసవి శిబిరాల ద్వారా ప్రతిభ ఉన్న యువకులకు నాణ్యమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఏపీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఆరు మైదానాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ, ఇందుకోసం విజయవాడ, మంగళగిరి, కడప, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడ స్టేడియాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Nandigama

బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం మూలపాడు స్టేడియంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసి క్రికెట్ అభివృద్ధికి దోహదపడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. త్వరలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో విజయవాడ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించి, అందులో రాణించిన క్రీడాకారులను విజయవాడ ఉత్సవంలో ఘనంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

Nandigama

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామ పట్టణంలో డాన్ బోస్కో కోహ్లీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు కావడం యువతకు వరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాల అందజేతతో విద్యార్థులు క్రీడల వైపు మరింత ఆకర్షితులవుతారని చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి భవిష్యత్తు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్మన్ కృష్ణకుమారి, కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి బాబు, టౌన్ పార్టీ అధ్యక్షుడు యేచూరి రాము, పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply