ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం…

ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం…

భారీగా తరలివచ్చిన భక్తులు.. పుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : కంచికచర్ల గ్రామ శివారులో జుజ్జూరు రోడ్డులో కొలువై ఉన్న నాగేంద్రస్వామి 43వ తిరునాళ్ళు మహోత్సవము ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏడాది ఉగాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం శ్రీ నాగేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాగేంద్ర స్వామి వారి దేవాలయం భారీగా చేరుకొన్న భక్తులు నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోసి పిల్లలకు చెవిపోగులు కుట్టించి మొక్కుబడును చెల్లించుకున్నారు.

తలనీలాలు సమర్పించి పాలు పొంగళ్ళు స్వామి కి నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నాగేంద్ర స్వామి ఉత్సవ కమిటీ, దాతల సహాయంతో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం అంతర్జాతీయ జానపద గాయకుడు హ్యాట్రిక్ నంది అవార్డు గ్రహీత దామోదర్ గణపతి రావు జానపద గీతాలు, నృత్యాలు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ గంగాధర్ చే మాట్లాడే బొమ్మ ప్రదర్శన, కోలాటాలు, భజనలు, కీర్తనలు, స్వామి వారి ప్రభ బండి ప్రధాన వీధుల్లో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

తిరుణాల సందర్భంగా స్వామివారి ప్రభను కంచికచర్ల పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామివారి ప్రభకు ఎదురేగి వారు పోసి నైవేద్యాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి ప్రభ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. నాగేంద్ర స్వామి తిరునాళ్ళు మహోత్సవం సందర్భంగా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచికచర్ల పరిసర ప్రాంతాల నుంచి కాకుండా జిల్లాలో నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిరునాళ్లలో పాల్గొన్నారు.

ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నందిగామ రూరల్ సీఐ చవాన్ ఆదేశాల మేరకు కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్, ఎస్ఐ 2 నాని నారేంద్ర అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా బందోబస్తు నిర్వహించారు. తిరుణాల సందర్భంగా కంచికచర్ల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Leave a Reply