గణాధిరాజో విజయస్థిరో గణపతి ధ్వజీ!
దేవదేవ స్మృరప్రాణదీపకో వాయుకీలకః!!
సర్వవిఘ్నైకహరణం సర్వకామఫలప్రదమ్
తతస్తస్మై సర్వనామ్నాం సహస్రమిద మబ్రవీత్.
సర్వవిఘ్నాలను తొలగించి ఇష్టకామనలు తీర్చే
ఆదిదేవుడికిదే నా నమస్సుమాంజలిలు. స్థిరవిజయాలను భక్తులకు అనుగ్రహించే ఆదిదేవునకు నమస్కరిస్తూ అందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు.
గణేశ చతుర్థికి ముందు తదియ రోజు కొన్ని ప్రాంతాలలో గౌరీ స్థాపన పూజ చేసి శివపార్వతులను పూజించి మరునాడు చతుర్థశి రోజు వినాయక వ్రతం చేస్తారు.
ఈ సందర్భాన్ని చక్కని పద్యంలో డాక్టర్ రఘుపతి శాస్త్రుల వారు హృద్యంగా వర్ణించారు.
భాద్రపదార్థమౌ తదియ వర్థిల నెంచుచు నుండు గాత
ఆ. అద్రిజ పార్వతీ జనని అర్మిలితో గని పూజసేయగా
భద్రమొసంగుచున్ కనుత భక్తుల నా గజవక్త్రు కల్మితో
క్షుద్ర జనమ్ములన్ భువిని కూల్చి హితమ్మొనరించి
సర్వదా..
మన సంప్రదాయంలో ఏ పని తలపెట్టినా ముందుగా శ్రీవిఘ్నేశ్వరుని తలచి, సక్రమంగా కొలిచి ఆ పనిని ప్రారంభిస్తాము. మనం జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రధానమైనది. బాధ్రపదమాస శుద్ధ చవితినాడు విఘ్నేశ్వర జననం జరిగింది. వేదకాలం నుండి ‘గణాధిపత్యము’ వినాయకునికి ఇవ్వబడినట్లు పురాణాలద్వారా మనకు తెలుస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా శ్రీవినాయకుని కొలిచినట్లు మనకు తెలుస్తోంది.
గణానాం త్వా గణపతిగం హవా మహే
కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత
ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనమ్!!
ఈ మంత్రములో గణపతిని ‘‘జ్యేష్టరాజః’’ అని స్తుతించటం జరిగింది. “ప్రథమంగా పూజలందుకుంటున్న వాడు” అని అర్థము. గణములకు అధిపతి ‘గణపతి’. గణములనగా దేవతా గణములని అర్థము. సృష్టి అంతా కలసి మొత్తం 33 కోట్ల దేవతాగణములచే నిర్వహింపబడుతూ వారి పాలనలో ఈ జగత్తు నడుస్తున్నదని వేదములు తెలియచేస్తున్నాయి. ఒక్కొక్క దేవతా గణమునకు ఒక్కొక్క సంఖ్య వుంది. అవి ఏమిటంటే ` రుద్రగణములు 11, గురు ఆదిత్యులు 12, వసువులు 8, అశ్వినులు 2, మొత్తంగా 33 దేవతా గణములు. ఈ అన్ని గణములకు అధిపతి, ప్రథముడు, ఏకైక దేవుడు శ్రీ గణపతి.
గణేశుడు ఓంకార స్వరూపుడని వేదం చెబుతున్నది. సంస్కృతంలో ‘‘ఓం’’ అనే అక్షరం వ్రాసి పరిశీలిస్తే, ఈ స్వరూపంలో కుడివైపు వంకరగా తిరిగియున్న ఒంపుయొక్క ఆకారమే ‘వక్రతుండము’. చంద్రరూపమే అర్థానుస్వారము “అర్థేదులసితం” అని గణపతి అధర్వశీర్షం తెలియచేస్తోంది. దానిపైన వున్న చుక్కయే ఫాలనేత్రము. లంబోదరము అనగా పెద్ద పొట్ట. సంస్కృతంలో వ్రాసిన ఈ ఓంకారము అర్థం 3 అంకె వలె పెద్దపొట్ట వుండటం కూడా చూడవచ్చును.
ఈ విధంగా ఏర్పడిన ప్రణవం యొక్క ఆకారమే గణపతి స్వరూపము. కాబట్టి ప్రణవ స్వరూపుడు అని, ఎంతో రహస్యంగా దానిని మనకు తెలియకుండా పెద్ద మొత్తంలో ఙ్ఞానాన్ని ఉదరంలో ఇముడ్చుకున్నాడని మన ఋషులు మనకు సూచించారు.
అంతేకాదు గణేశ విద్య ప్రాచీనమైన బ్రహ్మవిద్య. ప్రతి సంవత్సరంలోను బ్రహ్మచారులకు బ్రహ్మవిద్యను ప్రారంభింపచేసే పవిత్రమైన దినమే బాధ్రపద చతుర్థి. ఆ మరునాడే తూర్పున సప్తఋషులు ఉదయిస్తారు. ఈ సప్తఋషుల కిరణములు సాధకులపైన ప్రసరించే దినమే బ్రహ్మవిద్యకు అనువైన ‘ఋషిపంచమి’. అందువలన గణపతి బ్రహ్మవిద్యాప్రదుడైనాడు.
మంత్రశాస్త్రములో గణేశుని అనేక మూర్తులుగా వర్ణించారు. వ్యాసమహర్షి విరచిత అష్టాదశ పురాణాలలో అర్థంకాని నిగూఢమైన అనేక రహస్యాలున్నాయి. ఆ రహస్యాలను వివరించుటకు మరో 18 ఉపపురాణాలను కూడా వ్యాసుడు రచించాడు. ఈ ఉప పురాణాలలో ‘గణేశపురాణము’ ముఖ్యమైనది.
గణపతి విష్ణుస్వరూపుడని మరియు పర్వత గుహలలో బదరీనారాయణమనే ప్రాంతంలో తపస్సు చేసి పరబ్రహ్మ సాక్షాత్కారము పొంది దాని ద్వారా దివ్యదృష్టికి గోచరించిన జగత్ సృష్టి మొదలుగా ప్రళయము వరకు గల అనేక దేవ రహస్యములను దర్శించినట్లు మహాభారతము ఆదిపర్వములో తెలియచేయబడినది.
మంత్రశాస్త్రములో గణపతులు 32 రకాలుగా చెప్పబడినాయి. అందులో ముఖ్యమైనవి బ్రహ్మ గణపతి, శక్తి గణపతి, హేరంభ గణపతి, నృత్య గణపతి, సంకష్ట గణపతి, అమృత సిద్ధి గణపతి, వర గణపతి, ఉచ్ఛిష్ట గణపతి మొదలైనవి. అనేక రూపములలో అనేక బీజాక్షరముల సమ్మేళనంలో అనేక మూలమంత్రములలో వర్ణింపబడిన గణపతి మంత్రము ఈ 32 గణపతులపైన ఆధారపడియున్నది.
మంత్రమహాదధిలోను, ఇతర వాస్తు గ్రంథములలోను ఈ గణపతులకు ధ్యాన రూపములు, మూలమంత్రములు కూడా చెప్పబడి వున్నాయి. ఇవి చాలా చోట్ల శిల్పములుగా చెక్కబడి వుండటాన్ని కూడా మనము చూడవచ్చును. అందులో ఎక్కువగా మనకు దర్శనమిచ్చేది ‘‘వల్లభ గణపతి’’. ఈ రూపంలో గణపతి ఎడమ తొడపై వల్లభాదేవి (వల్లభ అనగా ప్రియమైన అని అర్థం) గణేశుని ప్రియ సతి కూర్చుండి ఆమె కుడిచేయి గణేశుని భుజముపై వేసినట్లూ, ఎడమచేత కలువ పూవు ధరించినట్లూ, గణేశుని చేతిలో అంకుశం, బీజాపూరం, పాశం, ఏకదంతం, పద్మం ధరించినట్లు వర్ణింపబడినది. దీనినే లక్ష్మీగణపతి అనుకుని కొందరు పొరబడి లక్ష్మీగణపతి మంత్రముతో ఆరాధిస్తున్నారు. ఇది గమనించవలసిన విషయము.
గణపతికి గరిక పూజ విశేష ఫలితాన్నిస్తుంది. గణేశ చతుర్థినాడు మాత్రమే తులసితో పూజింపవచ్చును. మిగిలిన రోజులలో తులసి పూజ నిషిద్ధము. ఆయనకు ఉండ్రాళ్ళు, కొబ్బరి, చెరకు మొదలైన నివేదనలు తృప్తినిస్తాయి.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ రూపంలో ఆరాధించినా మూలమూర్తి ఒక్కరే కనుక భక్తి శ్రద్ధలతో, త్రికరణ శుద్ధిగా కొలచినవారి కొంగు బంగారమై కోరికలు ఈడేర్చి, ఇహపర సుఖాలు గణపతి ప్రసాదిస్తాడనటంలో ఏమాత్రము అతిశయోక్తిలేదు.
సమస్యలతో బాధపడుచున్నవారు, జీవితంలో చైతన్యం కోల్పోయినవారు నమ్మకంతో అధర్వశీర్షం 41 రోజులు శ్రద్ధగా పారాయణ చేసినట్లయితే ఆనంద తీరాలకు చేరుకుంటారు. ఇది అనుభవయోగ్యమైనది.
ఈ పర్వదినాన మనందరం శ్రీగణేశుని భక్తిశ్రద్ధలతో కొలచి సర్వ సంకటములను దూరం చేసుకుని ఆనందంగా గడుపుదాం.
ఓం శ్రీ వినాయకాయ నమామి
- డాక్టర్ దేవులపల్లి పద్మజ.