నల్లగొండ, ఆంధ్రప్రభ :
వరుసగా ఒకరి తరువాత వకరు చనిపోతున్నారు… దశదినకర్మ పూర్తికాక ముందే మరొకరు మృతి చెందడం ఇలా రెండు నెలలుగా జరుగుతోంది. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇదీ తక్కెళ్లపహాడ్ గ్రామస్తుల పరిస్థితి! వానాకాలం సీజన్ ప్రారంభంలో పత్తితోపాటు మెట్టపంటలను కూడా గ్రామస్తులు సాగు చేశారు. అయితే వర్షాలు లేక విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తక.. రెండు మూడుసార్లు విత్తారు. భూగర్భ జలాలు అడుగంటి నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఒకవైపు వరస మరణాలు, మరోవైపు వర్షాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు తలలు పట్టుకున్నారు. చేసేదేమిలేక చివరకు గ్రామస్తులంతా కలిసి నకిరేకల్ లోని ఓ స్వామీజీని కలిశారు. గ్రామంలో వరుస మరణాలు సంభవించడం.. వర్షాలు కురవకపోవడానికి కీడే కారణమని చెప్పారు. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి.. ఓ ప్రాంతంలో కీడు వంటలు వండుకోవాలని.. స్వామీజీ గ్రామస్థులకు సూచించారు.
స్వామీజీ సూచన మేరకు…
స్వామీజి సూచన మేరకు తక్కెళ్లపహాడ్ గ్రామస్తులంతా ఊరు విడిచి ఒక్కరోజు వనవాసానికి వెళ్లాలని నిర్ణయించారు. అందరూ ఊరు విడిచి వెళ్లాలని, గ్రామంలో ఒక్కరు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించొద్దని, కిరాణ, మద్యం బెల్టు దుకాణాలు తెరవొద్దని, కోళ్లు, మేకలను కోయొద్దని దండోరా వేయించారు. ఊరు విడిచి వెళ్లకున్నా, దుకాణాలు తెరిచినా రూ.5 వేలు, గ్రామంలో కోళ్లు, మేకలు కోసి మాంసం విక్రయిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. ఇంకేముంది అందరూ ఉదయం 6 గంటలకు..ఇళ్లకు తాళం వేసి.. ఆదివారం పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి వనవాసానికి వెళ్లారు. సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి కీడు వంటకాలను వండుకొని తిన్నారు.