Nalgonda | ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి

Nalgonda | ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
Nalgonda | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు.
ఇందిరమ్మ కాలనీ మొత్తం తిరుగుతూ గృహాలను, రోడ్లను అలాగే నిర్మాణంలో ఉన్న నీటిసంపు సెప్టిక్ ట్యాంక్, హాస్పిటల్ పనులు, విద్యుత్ సరఫరా పనులను పరిశీలించి వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని సంబధిత అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(Advance Technology Center) ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ.. ఏటీసీ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకొని ఉపాధి కల్పన పొంది జీవితంలో స్థిరపడాలని కోరారు.
హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేసి సీరియల్ రిజిస్టర్ ను పరిశీలించి ఎంతమంది ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారని అడగగా ఇప్పటి వరకు 14 మంది తెచ్చారని, తేమ శాతం 17 రాగానే ధాన్యం శుభ్రపర్చి కాంటా వేసి మిల్లులకు తరలిస్తున్నామని నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మౌళిక వసతులు కల్పించామన్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ పొందాలని కోరారు. ఇప్పటి వరకు 25 వేల మెట్రిక్ టన్నుల(25 thousand metric tons) ధాన్యం సేకరించామని వెంటనే ట్యాబు ఎంట్రీ చేసి 48 గంటల లోపు రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. ఫణిగిరి రామస్వామి గుట్టవద్ద సింగిల్ బెడ్ రూమ్ ఇల్లులు మొత్తం 2160 మంజూరయ్యాయని బ్లాక్ కి 16 ఇండ్లు చొప్పున 135 బ్లాక్ లో నిర్మాణం చేపడుతున్నామని ఇప్పటికే 124 బ్లాక్ లలో 1984 ఇల్లులు పూర్తయ్యాయని, 11 బ్లాక్ లోని 176 ఇల్లులు స్లాబ్ పూర్తి అయి నిర్మాణ పనులు జరుగుతున్నాయని వాటిని త్వరగా పూర్తి చేస్తామని, సెప్టిక్ ట్యాంక్, రెండు నీటి సంపులు, సిసిరోడ్లు, డ్రైనేజీ పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
డిగ్రీ జూనియర్ కళాశాల, ఆర్.అండ్.బి అతిధి గృహం నిర్మాణ పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భూ భారతి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ప్రతి రోజు భూ భారతి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌజింగ్ పిడి సిధార్థ, ఎంపిడిఓ సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిఈ జంగయ్య, డిటి నాగేందర్, ఏఈ సాయిరాంరెడ్డి, వర్క్ ఇన్స్ పెక్టర్ అబ్దుల్లా, పి.ఏ.సిఎస్ సిఈఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
