నార్కట్ పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దోపిడీ
రూ. 25 లక్షలు చోరీ
పరారీలో ముగ్గురు ముఠా సభ్యులు.
రూ. 25 లక్షల నగదు, కారు స్వాధీనం.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : కరుడుగట్టిన మహారాష్ట్రకు చెందిన అంతర్ రాష్ట్ర దార్ దొంగల ముఠా గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ ను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారని, నిందితుడిని నుండి రూ. 25 లక్షలు, కారును స్వాధీనం చేసుకున్నారు. అస్రఫ్ ఖాన్ అరెస్టుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
నార్కెట్పల్లి వద్ద రూ.25 లక్షలు చోరీ
చెన్నై నుండి హైదరాబాద్కు ఈ నెల 9 వ తేదీన వెళ్తున్న శ్యామ్ సర్దార్ ట్రావెల్స్ బస్సు ను ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు నార్కెట్ పల్లి పూజిత హోటల్ వద్ద దిగారు. చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికుడు నెల్లూరు కు చెందిన బోయిన వెంకటేశ్వర్లు బస్సులోనే రూ. 25 లక్షల నగదు ఉన్న బ్యాగును ఉంచి కిందకు దిగాడు. అదే సమయంలో అస్రఫ్ ఖాన్ తోపాటు మరో ముగ్గురు బస్సులో నుంచి రూ. 25 లక్షల బ్యాగును చోరీ చేసి కారులో హైదరాబాదుకు వెళ్లారు. అదేరోజు బాధితుడు నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ దొంగల ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల ఆధారంగా విచారణ
నిందితులు కారులో హైదరాబాదుకు వెళ్లారని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు అదే కోణంలో విచారణ చూట్టారని, నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్ లోని దార్ జిల్లాలోని మన్ వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి అక్కడ గ్యాంగ్ లీడర్ అస్రఫ్ ఖాన్ ను అరెస్టు చేసినట్టు చెప్పారు. అతన్ని అక్కడి కోర్టులో హాజరు పరిచి నల్లగొండకు కోర్టు అనుమతితో తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ అస్రఫ్ ఖాన్ ను విచారించగా లైబ్ ఖాన్, అక్రమ్ ఖాన్, మహబూబ్ ఖాన్ లతో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులపై మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో పలు కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. చాకచక్యంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.