Murder | మాజీ మావోయిస్టు హత్య..

Murder | మాజీ మావోయిస్టు హత్య..

  • సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో ఘటన
  • సంచలనం సృష్టించిన మర్డర్
  • సిద్దన్న ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ నాయకుడు

తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla) తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మావోయిస్టు, మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య (58) హత్యకు గురయ్యారు. వేములవాడ శివారు లోని అగ్రహారం గుట్టల్లో సిద్దన్నను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పీపుల్స్ వార్ (People’s war) సిద్ధన్నగా పేరుగాంచిన నర్సయ్య దశాబ్దకాలం పాటు ఉద్యమంలో పని చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుపరిచితులైన సిద్ధన్న హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. 1997 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ (ఇప్పటి మావోయిస్టు)లో పని చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్ వ్యూలో.. సిద్ధన్నజగిత్యాల జిల్లాకు చెందిన ఫలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హత్య చేసినట్లు చెప్పారు.

యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూను చూసిన సదరు హత్యకు గురైన వ్యక్తి కొడుకు సంతోష్ సిద్ధయ్య పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని భావించినట్లు సమాచారం. ఇటీవల సిద్ధన్నతో స్నేహం చేసినట్లు తెలిసింది. మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తున్నారు. మీరంటే నాకు ఎంతో అభిమానమంటూ నమ్మబలికాడు. ఈక్రమంలోనే సిరిసిల్లకు వస్తూ సిద్దన్నను కలుస్తూ పోతున్నట్లు సమాచారం. వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి సిద్ధన్న పై బండ రాళ్లు ఎత్తేసి హత్య చేసినట్లు తెలిసింది. సంతోష్ పోలీసులకు లొంగిపోయి ఈ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మృతుడు సిద్ధన్నకు ఇద్దరు భార్యలు పోచవ్వ, ఎల్లవ్వ, ముగ్గురు పిల్లలు అశోక్, నరేశ్, పద్మ ఉన్నారు. సిద్ధన్న హత్యకు గురైనట్లు తెలిసిన కుటుంబ సభ్యులు గండిలచ్చపేట నుంచి బయలుదేరి వేములవాడకు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply