అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం..
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : తుఫాను ప్రభావంతో వరంగల్, ఖమ్మంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చుతుంది. బుధవారం సాయంత్రం నుండి క్రమక్రమంగా పెరుగుతున్న ఈ నీటి ప్రవాహం గురువారం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కులకు పైగా చేరుకుంది. వరంగల్లో ప్రారంభమవుతున్న ఈ మున్నేరు ఖమ్మంలో నుండి ఏపీలోని వాత్సవాయి, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల మీదుగా ప్రవహిస్తూ కృష్ణ నదిలో కలుస్తోంది. ప్రస్తుతం క్షణక్షణంకు పెరుగుతున్న నీటి ప్రవాహం కారణంగా పలు ప్రాంతాలలోని కాజ్వేల్ మీదుగా నీటి ప్రవాహం ఉంటుంది. మరీ ముఖ్యంగా వత్సవాయి మండలం లోని చిలకల్లు వైరా మార్గాల మధ్యలోని లింగాల కాజ వే మూడు అడుగుల ఎత్తు మేరా నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు.
అలాగే జగ్గయ్యపేట మండలంలోని బులుసుపాడులో కూడా రాకపోకలను నీటి ప్రవాహం కారణంగా నిలుపుదల చేయడంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు ప్రవాహం కారణంగా నందిగామ సబ్ డివిజన్లో ఎక్కువ ప్రభావం ఉన్న పరిస్థితులలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాలలో దండోరా వేయిస్తున్న అధికారులు మున్నేరు పరివాహక ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతాలలో అత్యధికంగా సాగుతున్న వరి మొక్కజొన్న పత్తి పంటలకు ఇబ్బంది కలిగించే ఈ నీటి ప్రవాహం కోసం రైతులెవ్వరు పంట పొలాల పైపు వెళ్ళకూడదటున్నారు.
మున్నేరుకు 2 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తే.. ఇబ్రహీంపట్నం నందిగామ మధ్యలో ఉన్న ఐతవరం వద్ద ఉన్న నేషనల్ హైవే పైకి నీరు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా కొన్నిసార్లు హైవే పైకి మున్నేరు నీటి ప్రవాహం వచ్చిన కారణంగా హైదరాబాదు విజయవాడ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కంచికచర్ల మండలంలోని కేసరబద్ద కూడా మున్నేరు నీటి ప్రవాహం అధికంగా కనిపిస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఏనుగ గడ్డ కూడా పొంగిపొర్లుతుండడంతో ఆ నీటి ప్రవాహం మున్నేరులో కలుస్తుండడం ప్రవాహ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అవసరమైన ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మున్నేరు నీటి ప్రవాహ పరిస్థితిని సిపి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

