ఏర్పేడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్

పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి


ఏర్పేడు, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను శనివారం తిరుపతి ఎంపీ (Tirupati MP) మద్దిల గురుమూర్తి పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గుర్తించి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023 లో రూ.98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటి, ఐజర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులు, అలాగే వెంకటగిరి (VenkataGiri), రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో ఎంపీ గురుమూర్తి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాలను పరిశీలించారు.

అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనుల(Bridge works) ను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తయితే ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, విద్యార్ధులు, ప్రయాణికులు, వ్యాపారులు, సరుకు రవాణాకు పెద్ద ఉపశమనం కలుగుతుందని ఆయన తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.

Leave a Reply