బీసీ రిజర్వేషన్లపై ఉద్యమాలే శరణ్యం

బీసీ రిజర్వేషన్లపై ఉద్యమాలే శరణ్యం
కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : బీసీల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంలో పాలక పార్టీలకు చిత్తశుద్ధి లేదని, అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం అని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ ఈ రోజు (శుక్రవారం) వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 9 తీసుకువచ్చి పూర్తి చట్టబద్ధ లేకుండా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి న్యాయస్థానంలో నిలబడకుండా చేసిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నారని, తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మాలోత్ సాగర్, నర్ర ప్రతాప్, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, గణిపాక ఓదేలు, ఐతమ్ నాగేష్, మహ్మద్ మహబూబ్ పాషా, మాలోత్ ప్రత్యూష, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, హైమద్, అప్పనపురి నర్సయ్య, నలివెల రవి, మంద అనిల్, రఘుపతి,యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
