Modern technology | బెజవాడలో హైటెక్ బందోబస్త్
- భవానీ దీక్షల విరమణకు సర్వసన్నద్ధం
- సీసీ కెమెరాలు, ఏఐ డ్రోన్లతో సీపీ పర్యవేక్షణ
- పాత నేరస్థులపై ఫేషియల్ రికగ్నైజేషన్ నిఘా
- అస్త్రం యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ
Modern technology | విజయవాడ,( క్రైమ్), ఆంధ్రప్రభ : భవానీ దీక్షా విరమణ కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు స్వీయ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికత(Modern technology)ను ఆయుధంగా చేసుకుని భక్తుల భద్రతకు విస్తృత చర్యలు చేపట్టారు. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి సి.సి. కెమెరాల ద్వారా స్నాన ఘాట్‌లు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, కేశఖండన శాలలు, హోల్డింగ్ ఏరియాలను పర్యవేక్షిస్తూ పోలీస్ సిబ్బంది(Police personnel)కి తగు సూచనలు ఇచ్చారు. ఏ.ఐ. డ్రోన్ కెమెరాల సహాయంతో గిరిప్రదక్షిణ ప్రాంతాల్లో రద్దీని నిరంతరం గమనించి అవసరమైన మార్గనిర్దేశం చేశారు.
ఫేసియల్ రికగ్నైజెషన్ కెమెరాల(Facial recognition cameras) ద్వారా ఆలయ పరిసరాల్లో పాత నేరస్థుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి, గుర్తించిన వెంటనే కంట్రోల్ రూం నుంచి సంబంధిత సిబ్బందికి సమాచారం పంపి తక్షణ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పరంగా అస్త్రం యాప్ ద్వారా రద్దీని నియంత్రిస్తూ వాహనాలను నిర్ణీత పార్కింగ్(Designated parking) ప్రాంతాల్లో నిలిపేలా చర్యలు చేపట్టారు. అలాగే హోమగుండాలు, విరుముడి స్టాల్స్, ప్రసాదం కౌంటర్లను పరిశీలించి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి. షిరీన్ బేగం , ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇలాక్కియా , క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం. రాజారావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


