MLC Kavitha | అవకాశమొస్తే.. మొదటి సంతకం ఆ ఫైలుపైనే..

MLC Kavitha | అవకాశమొస్తే.. మొదటి సంతకం ఆ ఫైలుపైనే..
- స్వర్ణకారుల సమస్యలు తెలుసు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : తనకు దేవుడు అవకాశమిస్తే… పుస్తె, మెట్టెలు, స్వర్ణకారుల నుంచే కొనాలనే ఫైల్ పైనే మొదటి సంతకం పెడతానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… స్వర్ణకారుల సమస్యలు తనకు బాగా తెలుసని, దేవుడు అవకాశం ఇస్తే పుస్తె, మెట్టెలు స్వర్ణకారుల నుంచే కొనుగోలు చేసే ఫైల్‌పై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.

వృత్తి పనిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులను ఆదుకుంటాం. స్వర్ణకారులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు బంగారం అంటే చాలా ఇష్టమన్నారు. చిన్నప్పటి నుంచి ఊళ్లల్లో పెరిగిన వాతావరణం నాకు గుర్తుందన్నారు. మా నానమ్మ ముక్కు పుడక చేయించాలన్నా స్వర్ణకారులను గౌరవంగా పిలిచి, మర్యాద చేసిన తర్వాతే ఆభరణాలు చేయించేవారన్నారు. స్వర్ణకారులు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు, ఒక్క మాట అంటే కూడా పడరన్నారు. వారి మనసు నిజంగా బంగారమేనని కవిత (Kavitha) భావోద్వేగంగా వివరించారు.
తెలంగాణ సాధనలో కేసీఆర్ తర్వాత జయశంకర్ సార్ ముందుంటారని, కేసీఆర్-జయశంకర్ జోడి ఎలా పనిచేసిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక బీసీల కోసం పనిచేస్తానని జయశంకర్ (Jayashankar) సార్ చెప్పేవారన్నారు. నన్ను కష్టపడుతున్నావని మెచ్చుకునేవారన్నారు. కేసీఆర్ కూతురు కనుక నీ కష్టాన్ని ఎవరు గుర్తించరని కూడా అనేవారన్నారు. అయినా తెలంగాణ సంస్కృతి కాపాడటం కోసం పనిచేయాలని సూచించేవారన్నారు.

డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సంస్కృతి పోతే మళ్లీ సాధించుకోలేమని చెప్పేవారన్నారు. అందుకే జాగృతిలో ఎప్పుడూ జయశంకర్ సార్ ఫోటోనే పెట్టుకుంటామని కవిత భావోద్వేగంగా పేర్కొన్నారు. శ్రీకాంతాచారి తెలంగాణ (Telangana) కోసం అమరులవడం బాధాకరమని, జాగృతిగా ఆత్మబలిదానాలు వద్దని కోరుకునేవారమని చెప్పారు. కచ్చితంగా పోరాడి లక్ష్యం సాధించాలని భావించేవారమే.. కానీ శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, రాష్ట్రం రావడంలో స్వర్ణకారులదే కీలక పాత్ర అని కవిత గుర్తు చేశారు.
