తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్

తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, జగన్

నేడు లేని దేవాలయాల అభివృద్ధి, ధార్మిక సంస్కరణలు
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరోః తిరుమల ఆలయ ప్రతిష్టను పెంచిన ఘనత నాటి వైయస్సార్, జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియా పాయింట్ గురువారం వద్ద మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను పెంచిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనకే దక్కుతుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు తమ చర్యలతోనే సంప్రదాయాలను దెబ్బతీశారని విమర్శించారు.


టీడీపీ అంటేనే దేవాలయాల కూల్చివేతకు ప్రతీకగా మారిందని పేర్కొంటూ, గతంలో పుష్కరాల పేరుతో విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేసిన ఘటనలను గుర్తుచేశారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత కూడా అదే కాలంలో జరిగిందని తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవాలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో వేల సంఖ్యలో కొత్త ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. పాత దేవాలయాల ఆధునీకరణకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ధార్మిక వాతావరణాన్ని బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ దుర్గగుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం కూడా అదే దిశగా తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పారు.

తిరుమలలో గోశాల విస్తరణ, నైవేద్య సేవల మెరుగుదల, చిన్నారుల్లో భక్తి పెంపొందించే కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల విస్తరణ వంటి అనేక చర్యలు జగన్ పాలనలో అమలయ్యాయని వివరించారు. టీటీడీ ఉద్యోగులకు వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ, కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. వంశపారంపర్య అర్చకులకు సేవలు కొనసాగించే అవకాశాన్ని కల్పించడం ద్వారా సంప్రదాయాలను కాపాడినట్లు చెప్పారు. అంతర్వేది ఘటనలో రథాన్ని పునర్నిర్మించి సమయానికి అందించడం, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక వైభవాన్ని విస్తరించడం జరిగిందని వెల్లడించారు.

ధార్మిక పరిషత్ వ్యవస్థ బలోపేతం, దేవాదాయ భూముల రక్షణకు ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా దేవాలయాల ఆస్తులను కాపాడినట్లు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమానికి అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం, వేతనాల పెంపు, వేద పాఠశాలల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ధూపదీప నైవేద్య పథకాన్ని వేలాది ఆలయాలకు విస్తరించడం ద్వారా పూజా విధానాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వైఎస్సార్ హయాంలోనే ధార్మిక పరిషత్ ఏర్పాటు, ఉచిత అన్నప్రసాదం, వేద విద్య ప్రోత్సాహం, భక్తి ఛానల్ ప్రారంభం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో గోవింద కార్యక్రమాలు నిర్వహించి భక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. చంద్రబాబు తమ ఇంటి దైవం అంటూ మాట్లాడుతూనే చేసిన వ్యాఖ్యలు, చర్యలు ఆలయాల ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో మాటలు కాదు, కార్యాచరణ ముఖ్యం అని స్పష్టం చేశారు.

Leave a Reply