కోగంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్..

కోగంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత స్ట్రాంగ్ కౌంటర్..
- వ్యక్తులు వ్యవస్థలను శాసించాలనుకోవడం అవివేకం..
- మైలవరం ప్రజల ఓట్లే నాకు ముఖ్యం..
- వారి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తా.. సత్యం ఓటు అవసరం లేదు..
- రేషన్ మాఫియాతో నాకు సంబంధాలున్నాయని నిరూపిస్తే..
- కొండపల్లి నడిబొడ్డున ఆత్మహత్య చేసుకుంటానని సవాల్..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : హిస్టరీ షీటర్ సర్టిఫికెట్ తనకు అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కొండపల్లిలో శనివారం రాత్రి ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే వసంత మీడియాతో మాట్లాడారు. వ్యక్తులు వ్యవస్థలను శాసించాలనుకోవటం అవివేకం అవుతుందన్నారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యం చేసిన వ్యాఖ్యల పై ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు మాటలతో కోగంటి హుందాతనాన్ని కోల్పోతున్నారని చెప్పారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తనకు రాజకీయాల పై పూర్తి అవగాహన ఉందని, మొదటిసారి 12,000, రెండోసారి 45000 ఓట్ల మెజార్టీతో గెలుపొందానని, ప్రజల ఆశీర్వాదాలు ముఖ్యం కానీ వ్యక్తులు ముఖ్యం కాదన్నారు.
మూడోసారి మైలవరంలో పోటీ చేస్తానని ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమన్నారు. మైలవరం ప్రజల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి కానీ, విజయవాడకు చెందిన వారు చెబితే కాదన్నారు. మైలవరంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఓట్లను అభ్యర్థిస్తానని, కోగంటి సత్యం ఓటు నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. రేషన్ మాఫియాకు సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. రేషన్ మాఫియా చేయాల్సిన దౌర్భాగ్యం ఎంపీ కేశినేని చిన్నికి లేదన్నారు. రేషన్ మాఫియాతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే కొండపల్లి పట్టణ నడి బొడ్డున ఆత్మహత్య చేసుకునేందుకు సైతం సిద్ధమని సవాల్ విసిరారు.
