ఎమ్మెల్యే కారు కలకలం..

ఆంధ్రప్రభ, చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా) : చెన్నేకొత్తపల్లి మండలం, గంగినేపల్లి బి తాండలో… ఎమ్మెల్యే స్టిక్కర్‌తో తిరుగుతున్న బ్లాక్ స్కార్పియో కారు కలకలం రేపింది. తెలంగాణ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ పేరుతో ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ వేసిన ఈ వాహనాన్ని స్థానిక పోలీసులు అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో హాకీ స్టిక్కులు బయటపడ్డాయి.

గణపతి ఉత్సవాల పర్మిషన్ కోసం సేవాలాల్ నాయక్, సునీల్ నాయక్ ఇద్దరు యువకులు ఈ వాహనంలో స్థానిక ఎస్ఐ సత్యనారాయణను కలిశారు. అయితే, గతంలోనూ ఇదే వాహనంపై ఉన్న స్టిక్కర్‌ను ఎస్ఐ తొలగించగా, మళ్లీ అదే విధంగా వాడటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తనిఖీల్లో హాకీ స్టిక్కులు దొరకడంతో, పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రెండు మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ ఇదే గ్యాంగ్‌పై కేసు!
గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇదే గ్యాంగ్ గంగినేపల్లి తండాలో హాకీ స్టిక్కులతో ఇళ్లలోకి దూరి దాడులు జరిపినట్టు ఎస్ఐ గుర్తు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Leave a Reply