అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలి..

అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలి..
ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : జనసేన ఉద్యమి సభ్యత్వాలు అత్యధిక సంఖ్యలో నమోదు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సాధకులకు పిలుపునిచ్చారు. శనివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణతో పిఠాపురం స్థాయిలో సభ్యత్వ నమోదు కావాలని కోరారు. ప్రణాళికతో ప్రతి గ్రామంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఆశించిన భాగస్వామ్యం పొందాలంటే, సభ్యత్వ నమోదు కీలకం అన్నారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ ద్వారా నామినేట్ పదవులు తీసుకున్న 175మంది అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పదవి బాధ్యతను గుర్తించి అందుకు అనుగుణంగా తమ బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, నామినేట్ పదవుల వారు తమ గ్రామ సాధకులకు తప్పనిసరిగా లక్ష్య సాధనకు సహకరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యతకు పార్టీ సభ్యత్వాలే కొలమానం, పార్టీ బలం చూపించే ఆస్కారంగా గుర్తించాలని సూచించారు. దీనికి తోడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా దృష్టిలో ఉంచుకుని, ప్రతి గ్రామంలో పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి పార్టీలో చేరే వారి సంఖ్య పెరిగేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సారథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గం అత్యధిక సభ్యత్వాలు సాధించాలని కోరారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ గత ఏడాది నమోదైన సభ్యత్వాలు, రెండు రోజులుగా నమోదైన సభ్యత్వాల గణాంకాలు, తాజాగా అత్యధిక రెన్యూవల్స్, నూతన సభ్యత్వాలు చేసిన వారి పేర్లు వివరించారు. నియోజకవర్గంలో సాధకులు ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభించి లక్ష్యాలు సాధించాలని సూచించారు.

అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి లంకె యుగంధర్, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, మర్రె గంగయ్య, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్ ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, జిల్లా కార్యదర్శులు గాజుల శంకరరావు, కొండవీటి సునీత, ఐటీ కో-ఆర్డినేటర్ కొండవీటి శివరాం, డీసీ చైర్మన్లు, దేవస్థానం చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, నీటి సంఘం అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు, టీసీ ఉపాధ్యక్షులు, ఆసుపత్రి డైరెక్టర్లు, నీటి సంఘాల డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధకులు, ఐటీ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజుల శంకరరావు రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
