MLA | ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా…

MLA | ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా…
- చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం
- మోడీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
- మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సమక్షంలో నిర్ణయం
MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బుడ్డ తండా, చెంచు పలుగుతాండ గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. గ్రామీణ ప్రాంత కూలీల హక్కులను హరించే విధంగా చట్టాన్ని మార్చితే ఊరుకోబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ తీర్మానాన్ని ఎఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సమక్షంలో సర్పంచి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆమోదించిన తీర్మాన పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతికి పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూలీలకు కనీస వేతనం కల్పించాలనే సంకల్పంతో అప్పటి ప్రధాని దివంగత పీవీ నరసింహారావు, ఎఐసీసీ నేత సోనియా గాంధీ నాయకత్వంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధంగా అమలు చేసి, సంవత్సరానికి కనీసం 100 రోజులు పని, రోజుకు రూ.200 కూలీ అందేలా చేశారని గుర్తు చేశారు. అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత మోడీ ప్రభుత్వం పేరు మార్చడం, చట్టాన్ని బలహీనపరచడం కుట్రగా విమర్శించారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం
తెలంగాణ విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బుడ్డ తండా గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బందూకులు, కత్తులు అవసరం లేదని, రోకలిబండలు, చీపురులు పట్టుకొని నడుముకు కొంగు చుట్టుకుని ప్రజాస్వామ్య పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విబిజి రామ్ హఠావో – ఉపాధి హామీ బచావో అన్ని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, అమరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మహిళా నాయకురాలు శారదమ్మ,, సర్పంచి నరసింహులు, రవీందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
