MLA | దేశంలో తొలిసారి ఏపీలో..
- విద్యుత్ చార్జీల తగ్గింపు
- ప్రజా రంజకంగా కూటమి పాలన
- రూ.4498 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది
- చారిత్రాతక నిర్ణయంతో యూనిటీ 13 పైసలు తగ్గాయి
- ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
MLA | జగ్గయ్యపేట ఆంధ్రప్రభ : విద్యుత్ చార్జీల తగ్గింపు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా రంజక పాలన కొనసాగుతున్నట్లు వివరించారు. విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ పాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నట్లు వివరించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కొత్తగా ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
2019 లో ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంచిందని, అనంతరం వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు భారాన్ని ప్రజలపై మోపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయం వనరుగా మార్చుకొని ఒకటి పాయింట్ 29 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీరమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ప్రణాళిక ద్వారా సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం వేల కోట్ల విలువైన ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు. 4498 కోట్ల చార్జీలు వసూలు చేయాలంటూ ఏపీ ఆర్‌సీ లేఖ రాసిన ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని జరిగిందన్నారు.
రాష్ట్రంలో సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్ లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం అందిస్తున్న సబ్సిడీపై అదనంగా 20 వేల రూపాయల అధిక సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం హుస్సేన్, నెల్లూరు శ్రీనివాసరావు, చిత్తూరి రమేష్, మారేపల్లి సౌరి, ఆదిమల్ల వెంకన్న పాల్గొన్నారు

