mla | భూమి సేకరణలో జాప్యం.. అభివృద్ధికి అడ్డంకి

mla |భూమి సేకరణలో జాప్యం.. అభివృద్ధికి అడ్డంకి
ఎంఎస్ఎంఈ, లెదర్ పార్కుల ఏర్పాటుకు భూమి సేకరణలో జాప్యం…
ప్రభుత్వ భూముల రికార్డుల్లేమితో అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డంకి..
రామన్నపాలెం భూములపై సమగ్ర సర్వే చేయించండి..
అన్యాక్రాంతాలపై చర్యలు తీసుకోవాలి
అసెంబ్లీలో తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు..
mla | తిరువూరు,ఆంధ్రప్రభః తిరువూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు, లెదర్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంగా అభివృద్ధిని వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక్కో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు.
అలాగే తిరువూరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా లెదర్ పార్కుల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు ప్రతిపాదించబడినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి జిల్లా, స్థానిక అధికారులను సంప్రదించి ప్రభుత్వ భూముల వివరాలు కోరినప్పటికీ, తిరువూరు పట్టణ పరిసరాల్లో వందల ఎకరాల భూమి ఉన్నా పూర్తి స్థాయిలో స్పష్టమైన రికార్డులు లేకపోవడం వల్ల స్థల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఏడాది కాలంగా ఈ కారణంగానే ఎంఎస్ఎంఈ పార్కుకు అవసరమైన భూమి గుర్తింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.
ముఖ్యంగా తిరువూరు పట్టణానికి సమీపంలోని రామన్నపాలెం గ్రామంలో జమీందారీ వ్యవస్థ రద్దు అనంతరం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వందలాది ఎకరాల భూములకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికీ లభించకపోవడం కీలక సమస్యగా మారిందన్నారు. ఆ భూములపై ఎవరు ఆక్రమణలు చేసుకున్నారు, ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి అనే విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల అభివృద్ధి పనులకు అడ్డు పడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమగ్ర భూసర్వే చేపట్టి, అన్యాక్రాంతమైన భూములను గుర్తించి వాటిపై ఉన్న అక్రమ డాక్యుమెంట్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భూములు తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి వస్తే ఒకవైపు ఎంఎస్ఎంఈ, లెదర్ పార్కుల ఏర్పాటుకు ఉపయోగపడతాయని, మరోవైపు తిరువూరు పరిసర ప్రాంతాల్లో నివాస స్థలాల కేటాయింపుకు కూడా వీటిని వినియోగించవచ్చని సూచించారు. అలాగే తిరువూరు పట్టణంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ 22-ఏ కేటగిరీలో ఉండటంతో ప్రజలు తమ ఇళ్లకు చట్టపరమైన హక్కులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
Parkas | భూమి సేకరణలో జాప్యం.. అభివృద్ధికి అడ్డంకి
ఈ భూములను 22-ఏ పరిమితుల నుంచి విముక్తి చేసి ప్రజలకు స్థిరాస్తి హక్కులు కల్పిస్తే సామాజికంగా, ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన ఈ పారిశ్రామిక ప్రాజెక్టులు భూమి సమస్యల కారణంగా నిలిచిపోకుండా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సర్వే, రికార్డుల శుద్ధి, అక్రమాల తొలగింపు వంటి చర్యలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో పాటు ఈ భూముల్ని ప్రజల అవసరాలకు, ఉపాధి అవకాశాల సృష్టికి వినియోగిస్తే తిరువూరు ప్రాంతం పారిశ్రామికంగా కొత్త దిశలో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
