Miryalaguda | టీఎస్‌ఆర్టీసీ బస్సుకు నిప్పు

మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లలో టీఎస్‌ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేగింది.

మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (TS05 Z 0047)ను నైట్‌ హాల్ట్‌గా మంగళవారం రాత్రి సంబంధిత డ్రైవర్‌ తడకమళ్లలో నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న కొందరు దుండగులు బస్సుకు నిప్పుపెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అర్పి అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే సమయానికి బస్సు వెనుక భాగం దగ్ధమైంది. బస్సు లోపల కొన్ని సీట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీల ద్వారా దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. ఘటనా స్థలానికి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా వచ్చారని పరిశీలిస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడ డిపో మేనేజర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Leave a Reply