మక్తల్, జులై 19 (ఆంధ్రప్రభ) : నారాయణపేట (Narayanpet) జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్టీసీకి మూడు అద్దె బస్సులను అందజేయగా ఇవాళ సాయంత్రం మక్తల్ పట్టణం (Maktal town) లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr. Vakiti Srihari) జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Collector Sikta Patnaik) తో కలిసి అద్దె బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వడ్డీ రాయితీ తిరిగి మహిళా సంఘాల ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. మహిళలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) 5నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు.

నేడు ఆర్టీసీకి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు అద్దె బస్సులను ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలబడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి ఆయా మండలాల ఎంపీడీవోలు మహిళా సమైక్య అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

