వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఇక్కడ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్రువీకరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభా వేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
గత ఐదేళ్లలో ఇబ్బందులు పడిన అమరావతి రైతులలో కొందరిని (కనీసం ముగ్గురు, నలుగురిని) ప్రధాని సమక్షంలో సన్మానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నామని, ప్రజల అంగీకారంతోనే పూలింగ్ ఉంటుందని, లేనిపక్షంలో భూసేకరణ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన అన్నారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు.