Minister | రాజీ లేదు..
- భక్తులకే పెద్దపీట
- ఇబ్బందులు రాకూడదు
- దేవాదాయ శాఖ మంత్రి
Minister | ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు : దేవాలయాల నిర్వహణ దేవాదాయ శాఖ ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారమే జరగాలని, అవి వేదమంత్రాలతో సమానమైనవిగా భావించి కట్టుదిట్టంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Ramanarayana Reddy) అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను నిరంతరం మెరుగుపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
శనివారం కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం, కర్నూలు–నంద్యాల జిల్లాలకు చెందిన దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల నిర్వహణ తీరుపై సమగ్రంగా సమీక్ష జరిపారు.
భక్తులే కేంద్రబిందువు
మంత్రి మాట్లాడుతూ… భక్తుల నుండి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దర్శనం, ప్రసాదం, పారిశుధ్యం, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా(Officials alert) వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అర్చకులు, వేదపండితులు, ధూప–దీప–నైవేద్యాలు, మరమ్మత్తులకు నిధులు వెచ్చిస్తున్న విధానంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

పనులు పూర్తి చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దేవాలయ పునర్నిర్మాణ పనులు, అసంపూర్ణంగా మిగిలిపోయిన నిర్మాణాల మరమ్మత్తులను(Repairs of structures) వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రతి పనిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
ఆస్తుల పరిరక్షణ కీలకం
దేవాలయాల ఆదాయ వనరులు, స్థిరాస్తుల పరిరక్షణ(Property protection)కు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అక్రమ ఆక్రమణలపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాలయ ప్రాంగణాల్లో చెట్లను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, పారిశుధ్య చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
శ్రీవాణి నిధుల వినియోగంపై దృష్టి
శ్రీవాణి నిధుల ద్వారా దేవాలయాల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, వేగం ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ… దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవలు, ప్రసాదంలో నాణ్యత, పారిశుధ్యం తదితర అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, పండుగలు, విశిష్ట దినాలలో దేవాలయాలను శోభాయమానంగా అలంకరించాలని తెలిపారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అధికారుల హాజరు
ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సతీష్, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, మద్దిలేటి స్వామి ఈవో రామాంజనేయులు, మహానంది, ఉరుకుందు ఈరన్న ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

