Minab 168 Flight : మినాబ్ 168 ఆగమనం Andhra Prabha News

Minab 168 Flight : మినాబ్ 168 ఆగమనం Andhra Prabha News
- అమెరికాతో శాంతి చర్చలే లక్ష్యం
- 71 మంది ఇరాన్ ప్రతినిధులు చేరిక
- పాకిస్థాన్ అపూర్వ స్వాగతం
ఆంధ్రప్రభ, ఇస్లామాబాద్ ప్రతినిధి

Minab 168 Flight : అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అమెరికాతో శాంతి చర్చలకు ఈ బృందం ‘మినాబ్ 168’ విమానంలో వచ్చింది. ఫిబ్రవరి 28, 2026న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలోని షజరే తయ్యేబే ఎలిమెంటరీ స్కూల్ పై అమెరికా క్షిపణి దాడిలో 168 మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు చిన్నారులే ఉన్నారు. వీరి జ్ఞాపకార్థం ఈ విమానానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. విమానంలోని ఖాళీ సీట్లలో విగత చిన్నారుల ఫోటోలు, స్కూల్ బ్యాగులు, కాళ్ల బూట్లు, పూలను ఉంచారు. “ఈ ప్రయాణంలో నా సహచరులు వీరే” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ పేర్కొన్నారు.

అమెరికాతో చర్చలు జరిపే ముందు మినాబ్ బాధితుల తరపున ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపేందుకు ఇరాన్ ఈ పద్ధతిని ఎంచుకుంది. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత, శాశ్వత శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సెయ్యద్ అబ్బాస్ అరాఘచీతో పాటు 71 మంది సభ్యులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్థాన్ సైన్యం వీరికి సాదర స్వాగతం పలికింది.
ALSO READ : Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News
