Mepma | స్కామ్ పై అధికారుల చర్యలు…!!

Mepma | స్కామ్ పై అధికారుల చర్యలు…!!

  • 8 మంది మెప్మా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు…!!
  • సుమారు 10 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు…!!

Mepma | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల ఆదేశాల మేరకు మెప్మా పీడీ మురళీకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా లో గత ప్రభుత్వంలో వైకాపా నాయకులతో కలిసి మెప్మా ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మెప్మా లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆనాడు వైసిపి నాయకులతో చేతులు కలిపి నకిలీ గ్రూపులను తయారుచేసి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.

బ్యాంకుల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి పై గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కృత్తికాశుక్ల సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి స్పందిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, రికవరీ కాకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.

దీంతో నరసరావుపేట మెప్మా కార్యాలయంలో పనిచేసే సిటీ మిషన్ మేనేజర్ తుమ్మ దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్ బి విజయ ప్రణతి, జి భూదేవి, సిటీ మిషన్ మేనేజర్ ఉమర్ వలి( వినుకొండ), సిటీ మిషన్ మేనేజర్ జి శ్రీనివాసరావు (పిడుగురాళ్ల), కమ్యూనిటీ ఆర్గనైజర్లు కే శ్రీనివాసరావు (గురజాల), డి బాలాంజనేయులు (పిడుగురాళ్ల), ఎం మల్లికార్జునరావు (చిలకలూరిపేట) లను సస్పెండ్ చేస్తూ మెప్మా పిడి మురళీకృష్ణ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా నకిలీ గ్రూపులు సృష్టించి కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కేటుగాళ్ళ జాడ ఇంకా గుర్తించలేదని అధికారులు చెబుతున్నాయి.

అయితే దుండగులకి సహకరించిన 8 మంది మెప్మా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు మాత్రం పడింది. గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, వినుకొండలో నకిలీ స్వయం సహాయక సంఘాల గ్రూపులు సృష్టించి కోట్ల రూపాయల నిధులు దిగమింగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఒక్క నరసరావుపేటలోనే నకిలీ గ్రూపులు సృష్టించి 6 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు వినికిడి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 8 మంది మెప్మా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ…పిడి మురళి కృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

కాగా వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడం పట్ల డ్వాక్రా సంఘాల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా నరసరావుపేటలో దీప, ఉమర్ వలి, ప్రణతిలు నకిలీ గ్రూపులతో రుణాలు పొందారని ఆరోపణలు స్పష్టంగా వెలుగు చూసినా…. కూటమి నేతలు మాత్రం వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇంత అవినీతి జరిగినా…ఆ ఉద్యోగులపై కూటమి నేతలకు ఉన్న మమకారమేమిటో తమకు అర్థం కావడం లేదని స్థానిక పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. మెప్మా శాఖలో కీలక ఉద్యోగుల సస్పెన్షన్ తో స్కామ్ సూత్రధారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పకనే తెలుస్తోంది.

Leave a Reply