Meets | కిషన్ రెడ్డిని కలిసిన ఐఎఫ్ టీయూ

Meets | కిషన్ రెడ్డిని కలిసిన ఐఎఫ్ టీయూ
- లేబర్ కోడ్స్ రద్దు చేయాలని విన్నపం
Meets | గోదావరిఖని, ఆంధ్రప్రభ : 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు పరిశ్రమ మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని ఐఎఫ్ టీయూ గోదారిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నేతలు అభిప్రాయపడ్డారు. ఆదివారం కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ఐఎఫ్ టీయూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐ కృష్ణ, జనరల్ సెక్రెటరీ సీతారామయ్య కలిశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రతినిధుల బృందం వినతి పత్రాన్ని అందజేసింది. సుమారుగా 1 లక్ష 30 వేల వరకు కార్మికులు పనిచేసిన బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో కొత్త బొగ్గు గనులు లేక రోజురోజుకు కార్మికుల సంఖ్య తగ్గిపోతుందని కేంద్రమంత్రికి నేతలు వివరించారు. కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణి పరిశ్రమ పరిరక్షించబడుతుందని పేర్కొన్నారు.
దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు పరిశ్రమ బొగ్గు బ్లాక్ లను సాధించుకోవడం కోసం వేలంపాటలో పాల్గొనమనడం సరైనది కాదని…. వేలం పాటలు లేకుండానే సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాగులను కేటాయించాలని ఈ సందర్భంగా నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐ ఎఫ్ టు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సింగరేణి బొగ్గు పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యను ఈ సందర్భంగా కేంద్రమంత్రి కి వివరించారు. కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ నిర్ణయించిన హై పవర్ వేతనాలను అమలుచేయాలని గోదారిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన వారిలో గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న,రాష్ట్ర నాయకులు ఎన్ సంజీవ్ పాల్గొన్నారు.
