జానకినగర్‌లో మైనార్టీ నేతల భేటీ..

  • అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. – మంత్రి వివేక్
  • నవీన్‌ యాదవ్‌ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు…
  • బీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసిన‌ట్టే

టోలిచౌకి (హైదరాబాద్‌), ఆంధ్రప్రభ: టోలిచౌకిలోని జానకినగర్‌లో మైనార్టీ నేతలతో విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫయీమ్ హాజరయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఉత్సాహం నింపారు.

ఈ స‌మావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నేను షేక్‌పేట్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని చాలా పనులు చేయించాను. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాన‌ని అన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే, ఆయనతో పాటు నేను, అజారుద్దీన్ కలిసి మరిన్ని అభివృద్ధి పనులు చేయిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మైనార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా లేకపోవడంతో మంత్రి పదవి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పిన‌ట్టు వెల్లడించారు.

అలాగే, ఇటీవలి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లు బీజేపీనే గెలిచింది…. బీఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకే పడ్డాయి, ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అదే బీజేపీకి ఓటు వేసినట్టే అవుతుంద‌ని హెచ్చరించారు. బీజేపీ నేతలు కూడా “మా ప్రచారం అంతగా సీరియస్‌గా లేదు” అని చెబుతున్నారని వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు.

నవీన్ యాదవ్ మంచి నాయకుడు, అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్నాడు. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండని మైనార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Leave a Reply