ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి

ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి
నితిన్ గడ్కారితో రామ్మోహన్ నాయుడు భేటీ
నరసన్నపేట టూ ఇచ్చాపురం జాతీయ రహదారి ఆవశ్యకతను వివరించిన రామ్మోహన్ నాయుడు
నవభారత్ కూడలిలో ఫ్లై ఓవర్, అండర్ పాస్ వంతెన అవసరాన్ని వివరించిన సిక్కోలు ఎంపి
కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం,గార-అలికాం-బత్తిలిని జాతీయ రహదారులుగా మార్చాలని వినతి
హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారితో అయన కార్యాలయంలో గురువారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటి అయ్యారు. పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాల తీరుపై ఇరువురు మంత్రులు కాసేపు చర్చించుకున్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులను నితిన్ గడ్కరి దృష్టిలో రామ్మోహన్ నాయుడు ఉంచారు.
ఇందులో ప్రధానంగా.. జాతీయ రహదారి – 16లోని నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు సుమారు వంద కిలోమీటర్ల రహదారిని ఆరు వరుసలు చెయ్యాల్సిందిగా కోరారు. జిల్లాలో మూలపేట పోర్టు శరవేగంగా నిర్మాణం అవుతుండటంకి తోడు.. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పట్టణాలు సైతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భవిష్యత్ అవసరాలకు, ట్రాఫిక్ నియంత్రణకు ఆరు వరుసల జాతీయ రహధాని అత్యంత అవశ్యం అని పరిస్థితులను రామ్మోహన్ నాయుడు వివరించారు. నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు ఉన్న ఫ్లై ఓవర్లు అన్ని ఇప్పటికే ఆరువరుసలుగా ఉండటంతో.. కేవలం రహదారులను విస్తరణ చేస్తే సరిపోతుందని తెలిపారు.
ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం గురువారం పత్రికాప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలోని నవభారత్ కూడలి వద్ద ఫ్లై ఓవర్ లేదా అండర్ పాస్ వంతెన నిర్మాణం గురించి నితిన్ గడ్కారి తో ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి జాతీయ రహదారి గతంలో నవభారత్ కూడలి నుండి ప్రారంభమై.. నగరం మధ్యలో నుండి వెళ్లేదని.. కాని నగరానికి వెలుపల అన్ని వసతులతో జాతీయ రహదారి విస్తరణ జరిగిన తరువాత.. ప్రధాన కూడలిగా ఉన్న నవభారత్ జంక్షన్ లో ఎలాంటి అండర్ పాస్ కానీ, ఫ్లై ఓవర్ కాని నిర్మాణం జరగకపోవడం వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అప్రమత్తంగా ఉన్నా ప్రమాదాలు సైతం జరుగుతూ ఉన్నాయని.. ఈ నేపధ్యంలో జాతీయ రహదారిలో నవభారత్ కూడలి ఉన్న కి.మీ.నెం.609+600 వద్ద ఫ్లైఓవర్ లేదా వాహన అండర్‌పాస్ ను త్వరితగతిన ఏర్పాటు చెయ్యాలని నితిన్ గడ్కారిని కోరారు. వినతి పత్రాన్ని అందించారు.
అలాగే రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం – శ్రీకాకుళం – పార్వతీపురం 145 కిలోమీటర్లు , గార – అలికాం – బత్తిలి 118 కిలోమీటర్ల లైన్లను జాతీయ రహదారులుగా మార్చాలని రామ్మోహన్ నాయుడు కోరారు. పాతపట్నం నీలమణి దుర్గ ఆలయం వద్ద నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ వద్ద సాధారణంగా ఉండే ఫ్లై ఓవర్ ఆకృతి గా కాకుండా.. ఆలయం అందరికి కనబడే విధంగా పిల్లర్ తరహా ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే విధంగా డిజైన్ లో మార్పునకు అంగీకరించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రులు ఇరువురు జిల్లా పరిస్థితులు, అవసరాలపై సుదీర్ఘంగా చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రహదారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది అని నమ్మే ఎన్డియే సర్కారు.. తప్పక ఈ ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తన శాఖ సిబ్బందికి సంబంధిత ప్రాజెక్టులపై క్షేత్ర స్థాయి పరిస్థితులతో కూడిన నివేదికను సిద్ధం చెయ్యాలని నితిన్ గడ్కారి ఆదేశించారు. నితిన్ గడ్కారి హామీతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే.. మరింత వేగంగా వృద్దివైపు బలమైన అడుగులు వేయ్యోచ్చని స్పష్టం చేశారు.
