Medak | ప్రియురాలు హత్య, బాడీని పెట్రోల్ పోసి తగులబెట్టిన ప్రియుడు
మెదక్ జిల్లాలో వెలుగులోకి దారుణ ఘటన.
ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో హత్య
ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు.
మద్యం తాగుదామని చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లి హత్య
మెదక్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో ప్రియుడు ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే, ఈ నెల 6వ తేదీ నుంచి మెదక్ పట్టణానికి చెందిన రేణుక (45) కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం నేపథ్యంలో కుమారుడు శ్రీనాథ్ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు రేణుక ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఆమెకు ఇంటి పక్కనే ఉంటున్న యేసు (40) అనే వ్యక్తితో తరచుగా మాట్లాడిన రికార్డు బయటపడింది. దాంతో పోలీసులు యేసును విచారించగా, హత్యకు సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రేణుక భర్త మరణించడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలోని ఫతే నగర్‌లో నివసించేది. ఇంటి పక్కనే ఉంటున్న యేసుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, ఈ విషయం రేణుక కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారులు మందలించడంతో రేణుక, యేసుతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంది. అయితే ప్రియురాలు దూరమైందన్న ఆవేశంలో యేసు, ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
యేసు, రేణుకను మద్యం తాగుదామని చెప్పి చిన్న శంకరంపేట మండలంలోని కొండాపూర్ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగగా, మత్తులో ఉన్న రేణుకను యేసు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. రేణుక అదృశ్యం కేసును పోలీసులు వివిధ కోణాలలో విచారించడంతో హత్యకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయి. నిందితుడిని సోమవారం నాడు అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయస్థానంలో హాజరపరిచారు.. అతడికి 14 రోజులు రిమాండ్ విధించారు న్యాయమూర్తి..