బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టర్ సిక్తా పట్నాయక్(Collector Sikta Patnaik) ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్(video conference) హాల్‌లో షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ఎస్సీ, ఎస్టీ కేసులను సీరియస్‌గా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ నల్లపు లింగయ్య, షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ లింగయ్య వివరాల ప్రకారం, 2023లో 31, 2024లో 34, ప్రస్తుత సంవత్సరం 2025లో ఇప్పటివరకు 13 ఎస్సీ, ఎస్టీ(SC, ST) కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు కేసులు చార్జ్‌షీట్ దశలో ఉన్నాయని, మిగతా కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు.
సీ సెక్షన్ అధికారి రాణి దేవి మాట్లాడుతూ.. బడ్జెట్ లోపం కారణంగా నష్టపరిహారం చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, నిధులు అందిన వెంటనే రెండు వారాలకొకసారి బాధితులకు నష్టపరిహారం చెల్లించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రతి నెలా పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ(DSP) తెలిపారు. గత మూడు నెలల్లో (జూన్, జూలై, ఆగస్టు) 30వ తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.
ఎస్పీ డాక్టర్ వినీత్(Dr. Vineeth) మాట్లాడుతూ.. విజిలెన్స్ కమిటీ నిర్ణయాలకు పోలీసు శాఖ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు. సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ.. అక్టోబర్ 24న కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రం, 25న నారాయణపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్(Cancer Screening) శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.
సమావేశంలో గిరిజన సంఘం నాయకుడు కిష్ట్యా నాయక్.. జిల్లా కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాడు. అలాగే పేర పళ్ళ మీది తండా, కింది తండాలలో నీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలని కోరాడు. దీనిపై కలెక్టర్ వెంటనే డీపీఓకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.