మహా గణపతి అఖండ అనుగ్రహమే పురాణపండ నిను ప్రార్ధన చేసెద !

  • ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ప్రశంసల వర్షం

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : అఖండ దైవబలంతో, నిస్వార్ధ యజ్ఞ భావనతో, అసాధారణ ప్రతిభతో విమర్శల్ని కూడా ఘన విజయాలుగా మార్చుకోవడంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ అకుంఠిత కృషి ప్రస్ఫుటంగా మనకన్నుల ముందు కనిపిస్తోందని వేంకటేశ్వర విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతి, ప్రఖ్యాత సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పేర్కొన్నారు. గణపతి నవరాత్రులు ఉత్సవాలను పురస్కరించుకుని జ్ఞానసరస్వతీ దేవాలయం సమర్పణలో ఆదివారం ఉదయం త్యాగరాయ గానసభలో జరిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ దివ్య రచన నిను ప్రార్ధన చేసెద గ్రంథావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇనాక్‌ మాట్లాడుతూ… తాత తండ్రులను మించి ఆర్ష సాహితికి పురాణపండ శ్రీనివాస్‌ చేస్తున్న ఆధ్యాత్మిక భావజాల సేవ అనన్య సామాన్యమైందని అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ… ఆధ్యాత్మిక, సాహిత్య, కవిత్వ రంగాలలో అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న పురాణపండ శ్రీనివాస్‌ వెనుక ఉన్న దైవ బలానికి ఆయన నిర్విరామ కృషి, అసాధారణ ప్రతిభే కారణమని చెప్పారు.

జంటనగరాలే కాకుండా తెలంగాణలో ఎన్నో మఠాలలో, పీఠాలలో, ఆలయాలలో, ధార్మిక మండళ్లలో పురాణపండ శ్రీనివాస్‌ అపురూప గ్రంధాలు దర్శనమిస్తున్నాయని, ఈ ఉద్యమానికి ఊపిరిస్తున్న దేవాదాయ శాఖామంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి, కొండా సురేఖ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కే.వీ.రమణాచారి, జి .కిషన్‌ రావు, భారతదేశ కేంద్ర అడ్వకేట్‌ సొలిసిట్‌ జెనరల్‌ చల్లా ధనంజయ, కిమ్స్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ బొల్లినేని కృష్ణయ్య, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, తెలంగాణ పూర్వ స్పీకర్‌ మధుసూదనాచారి, జె జె హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ జయంతీ రెడ్డి తదితర ప్రముఖులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

తొలిప్రతి స్వీకరించిన హైకోర్ట్‌ న్యాయమూర్తి పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్‌ మాట్లాడుతూ… ఆర్ష భారతికి పురాణపండ శ్రీనివాస్‌ నిస్వార్ధ యజ్ఞ ప్రతిభా హారతిగా ఆయన రచనల్ని ప్రశంసించారు. గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ… తిరుమల శ్రీవారి శ్రీకటాక్షంగానే ఈ అపూర్వ కదలికలన్నీ జరుగుతున్నాయని, తాను నిమిత్తమాత్రుణ్ణనీ స్పష్టంగా పేర్కొన్నారు.

Leave a Reply