వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణం

ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి ; భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శుక్రవారం భక్తి భావంతో నిత్య సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించారు .కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి.ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం గోపృష్ట దర్శనం భక్తులకు కల్పించగా, భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందె తీర్థాన్ని తీసుకువచ్చి నిత్యారాధన కార్యక్రమాలు చేపట్టారు . స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. వైభవోత్సవ మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించి ఆనంద భరితులయ్యారు.
అన్నప్రసాద వితరణలో 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మాడవీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా జరిగింది. మేళతాళ ధ్వనులతో కూడిన ఈ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.తిరువీధి ఉత్సవం అనంతరం సహస్రదీపాల కాంతుల మధ్య స్వామివారు ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
