marriage | వంశిక వెడ్స్‌ కుల్దీప్

marriage | వంశిక వెడ్స్‌ కుల్దీప్

చిన్న‌నాటి స్నేహితురాలిని పెళ్లాడ‌బోతున్న స్టార్ స్పిన్న‌ర్‌
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ వేదికగా రేపు వివాహ వేడుక‌
హాజ‌రుకానున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నాడు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలైన వంశిక‌ను త‌న ప్రేమ‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. రేపు( శ‌నివారం) ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ వేదికగా పెళ్లాడ‌బోతున్నాడు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కుల్దీప్ యాదవ్, వంశికలది చాలా కాలం నాటి స్నేహబంధం. కాన్పూర్‌లో వీరి కుటుంబాలు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే నివసించేవి. కుల్దీప్ లాల్ బంగ్లా ప్రాంతానికి చెందినవాడు కాగా, వంశిక శ్యామ్ నగర్ వాసి. కుల్దీప్ అండర్-19 ఆడే రోజుల నుంచే వీరిద్దరికీ పరిచయం ఉంది. వంశిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మెల్‌బోర్న్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

ఈ వేడుకకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ హై-ప్రొఫైల్ వివాహం కోసం ముస్సోరీలోని చారిత్రక సావోయ్ హోటల్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కోసం హోటల్‌ను మొత్తం బుక్ చేశారు. ఈ హోటల్‌లోని 80 గదులతో పాటు సమీపంలోని ఇతర లగ్జరీ హోటళ్లలో కూడా గదులను రిజర్వ్ చేశారు. అతిథులు, కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది కోసం ఈ భారీ ఏర్పాట్లు చేసినట్లు హోటల్ యాజమాన్యం వెల్ల‌డించింది. రెండు మూడు రోజుల పాటు ఈ హోటల్ ఇతరులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

Leave a Reply