Mangalagiri | ఓట‌రు దేవుళ్ల‌కు లోకేష్ ‘ప‌ట్టా’భిషేకం

4 వ రోజుకి చేరిన మ‌న ఇల్లు – మ‌న లోకేష్
మంత్రి నారా లోకేష్.. ప్రేమ కానుక..!
పసుపు.. కుంకుమ.. నూతన వస్త్రాలు..
శాశ్వత ఇంటి పట్టాలు..లబ్ధిదారులకు అందజేత
హామీలు.. యుద్ధ ప్రాతిపదికన అమలు.
ప్రజలు 91 వేల భారీ మెజారిటీ ఇచ్చారు..
నా గుండెల్లో పెట్టుకుంటా.. నారా లోకేష్ భావోద్వేగం..!
ఈ నె 13న వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
రోజురోజుకీ ఇంటి పట్టాల సంఖ్య పెరుగుతోంది
అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను అభివృద్ధి చేస్తాం..
అవినీతి రహిత పాలనే మా లక్ష్యం..!
మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ
రత్నాల చెరువుకు చెందిన 600 మందికి
మహానాడు ప్రాంతానికి చెందిన వారికి 430 పట్టాలు..
మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళి

మంగళగిరి ఆంధ్రప్రభ – రాష్ట్ర ఐటి , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రేమ పూర్వక కానుకలు అందించారు. లబ్ధిదారులకు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు పెట్టి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. దీనితో లబ్ధిదారుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. గత ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి లోకేష్ అమలు చేస్తున్నారు.

మంగళగిరి నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతి పదికన అమలుచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో రత్నాల చెరువుకు చెందిన 600 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. కాగా మహానాడు ప్రాంతానికి చెందిన 430 మందికి పట్టాలు అందజేశారు. మొత్తం నాలుగవ రోజు 1030 మందికి పట్టాల పంపిణీ చేయడం విశేషం.

ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కొన్ని నిర్ణయాలు మన జీవితాలనే మార్చేస్తాయి. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో నేనొక నిర్ణయం తీసుకున్నా. మీ సమస్యలేంటో నాకు తెలియదు. నేనేంటో మీకు తెలియదు. ఎన్నికలకు 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా పోటీచేశా. 5,300 ఓట్లతో ఓడిపోయా. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ప్రజలకు మంచి పనులు చేసి వారి మనస్సు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా.

26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం

ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 2024వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవని తీసుకురావడం జరిగింది. తాడేపల్లిలో, మంగళగిరిలో, దుగ్గిరాలలో క్లినిక్ ఏర్పాటుచేసి నేటికీ కొనసాగిస్తున్నాం. ఈ రోజుకీ సొంత నిధులతో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నాం. మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా అందించాం. వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం నీరు సక్రమంగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువత క్రికెట్ ఆడేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటుచేశాం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వార టెలీమెడిసిన్ అందజేశాం. ఈ విధంగా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేపట్టడం జరిగిందన్నారు.

భారీ మెజారిటీ ఇచ్చారు.. లోకేష్ భావోద్వేగం..!

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నాకు 91 వేల భారీ మెజారిటీ అందించారు ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుంటా అంటూ మంత్రి నారా లోకేష్ ఒకింత బాగోద్వేగానికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని చాలా మంది చెప్పారు. ఐదేళ్లు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనస్సు గెలుచు కున్నానని ఆనాడు చెప్పా. ఒకే స్థానం నుంచి పోటీ చేస్తా.. అది మంగళగిరి నుంచే పోటీచేస్తానని చెప్పా. ప్రచారంలో మీ వద్దకు వచ్చాను. ఏ మెజార్టీతో అయితే ఓడిపోయానో దాని పక్కన సున్నాపెట్టి 53వేల ఓట్లతో గెలిపించాలని కోరా. మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా. సర్వేల్లో కుప్పం కంటే ఒక్క శాతం వెనుకబడి ఉన్నాం. మీరు చూపించిన అభిమానం, ప్రేమ చూసి ఒక్క ఓటు అన్నా ఎక్కువ వస్తుందని బాబు తో ఛాలెంజ్ చేశా. మంగళగిరి ప్రజలు ఎవరూ ఊహించని విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారని నారా లోకేష్ అన్నారు.

ఈ నెల 13న వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

మీరు ఇచ్చిన మెజార్టీ కొండంత బలం. దశాబ్దాల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి. ఏపీలో మొదటి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ఈ నెల 13న శంకుస్థాపన చేస్తున్నాం. ఏడాదిలోగా పూర్తిచేస్తాం. చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యత తీసుకుంటారు. పార్క్ లు, చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, కరెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. జూన్, జులైలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం తర్వాత పానకాల స్వామి గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని చాలామంది చెప్పారు. దీంతో ఉచితంగా బస్సు ఏర్పాటుచేశాం. మంగళగిరి, తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కు వెళ్లేందుకు రెండో బస్సు కూడా ఉచితంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ పోతున్నామని లోకేష్ అన్నారు.

రోజురోజుకీ ఇంటి పట్టాల సంఖ్య పెరుగుతోంది

దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న ఇళ్లకు శాశ్వత ఇంటి పట్టా ఇవ్వాలని ఆనాడు కోరారు. తొలి విడత సంవత్సరంలోగానే ఇస్తానని చెప్పా. ఎండోమెంట్, రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చేందుకు మరో సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ, కాలువ, కొండపోరంబోకు భూములకు కొంత సమయం పడుతుంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే మీ లోకేష్ ఈ రోజు మీ ముందు నిలబడ్డాడు. కూటమి నాయకులందరూ కలిసికట్టుగా అధికారులతో మీ ఇంటికి వచ్చి కప్పు కాఫీ కూడా తాగకుండా కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు. రెవెన్యూ మంత్రి అనగాని తో మాట్లాడి సహకరించాలని కోరా. ఈ జీవో రాష్ట్ర ప్రజలకు కూడా పనికి వస్తుందని చెప్పా. అనగాని ప్రోత్సాహంతో ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారుగా 3200 కుటుంబాలకు ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీయే ప్రభుత్వం అందజేయడం జరుగుతోంది. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాం

ఈ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు. నేనిచ్చే పట్టాతో వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కూడా వస్తుంది. శాశ్వత హక్కు ఎన్డీయే ప్రభుత్వం మీకు అందజేస్తోంది. ఇది మనందరి దశాబ్దాల కల. ఆ హామీని నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చా. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ (లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయబోతున్నాం. 50 రోజుల్లో పాఠశాల రూపురేఖలు మారిపోవాలని అధికారులతో చెబుతున్నా. పట్టుదలతో పనిచేస్తున్నా.

హామీలను యుద్ధప్రాతిపదికన అమలుచేస్తాం

మంగళగిరి ప్రజలు అన్నివిధాలుగా నాకు అండగా నిలిచారు. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తా. సూపర్ సిక్స్ లో కొన్ని హామీలు మే నెలలో నిలబెట్టుకోబోతున్నాం. మంగళగిరికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతిపదికన అమలుచేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందo అబద్దయ్య టిడిపి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి తమ్మిశెట్టి జానకి దేవి నేతలు కాండ్రు శ్రీనివాసరావు ఆరుద్ర భూలక్ష్మి ఆకుల జయ సత్య షేక్ రియాజ్ తోటపార్ధసారథి గుత్తికొండ ధనుంజయ రావు ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఇంకా పలువురు టిడిపి కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *